బోరుగడ్డ అనిల్ కి న్యాయస్థానం మరోసారి రిమాండ్ పెంచింది. ఇటీవల 14 రోజుల రిమాండ్ విధించిన గుంటూరు న్యాయస్థానం… తాజాగా మరో 14 రోజుల రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దాంతో బోరుగడ్డ అనిల్ నవంబరు 12 వరకు రిమాండ్ లో ఉండనున్నాడు. పోలీసులు బోరుగడ్డ అనిల్ ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్నారు. గుంటూరులో కర్లపూడి బాబుప్రకాశ్ అనే వ్యక్తిని రూ.50 లక్షలు డిమాండ్ చేసిన కేసులో బోరుగడ్డ అనిల్ ను పోలీసులు అరెస్ట్ చేయడం తెలిసిందే. ఇటీవలే కోర్టు మూడు రోజులు కస్టడీకి అనుమతించడంతో, గుంటూరు పోలీసులు అనిల్ ను ప్రశ్నించారు. ఇతర ఆరోపణలకు సంబంధించి కూడా అతడిని ప్రశ్నించినట్టు సమాచారం. అయితే, జగన్ ఎవరో తనకు తెలియదని అతడు పోలీసు విచారణలో చెప్పినట్టు తెలుస్తోంది. అటు, బీజేపీ నేత, ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ పై గతేడాది మార్చి 31న జరిగిన దాడికి సంబంధించి బోరుగడ్డ అనిల్ పై మరో కేసు కూడా నమోదైంది. ఈ దాడి కేసులో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ ఏ1గా, బోరుగడ్డ అనిల్ ఏ2గా ఉన్నారు.