తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మరింత పవిత్రంగా మార్చాలన్న ఆలోచనలో కొత్త టీటీడీ బోర్డు ఉంది. అందు కోసం ముందుగా అసలు కొడపై గోవిందనామం తప్ప మరో మాట వినిపించకుండా చేయాలని అనుకుంటున్నారు. శ్రీవారిని దర్శించుకుంటున్న పలువురు ప్రముఖులు ..తర్వాత మీడియా ముందు రాజకీయ ప్రకటనలు చేస్తున్నారు. వైసీపీ హయాంలో ప్రత్యేకంగా అటెన్షన్ రావడానికే తిరుమలకు వచ్చి స్వామి వారి దర్శనం పేరుతో మీడియా ముందు ప్రకటనలు చేసేవారు. అలాంటి పరిస్థితిని పూర్తిగా మార్చాలని నిర్ణయించారు.
తిరుమలలో రాజకీయాలు మాట్లాడటాన్ని ఎప్పుడో నిషేధించారు. కానీ అమలు చేయడం లేదు. మాట్లాడేవాళ్లంతా ప్రభుత్వాల్లో పలుకుబడి ఉన్నవారే కావడంతో వారిని టీటీడీ అధికారులు ఏమీ చేయలేకపోయారు. రోజాతో పాటు ఎంతో వైసీపీ నేతలు శ్రీవారి ఆలయం ముందు ఎన్నో ఘోరమైన వ్యాఖ్యలు చేశారు. కానీ ఎవరూ అడ్డం చెప్పలేదు. భక్తుల మనోభావాలను పట్టించుకోలేదు. ఇక నుంచి అలాంటి పరిస్థితి లేకుండా అసలు శ్రీవారి ఆలయం వద్ద మీడియాతో మాట్లాడే అవకాశం లేకుండా చేయాలనుకుంటున్నారు.కొండపై రాజకీయాలు మాట్లాడితే.. కొండ దిగక ముందే కేసులు పెట్టాలని ఆలోచిస్తున్నారు. ఇప్పటికే అధికార పార్టీసభ్యులకు చాలా స్పష్టమైన సమాచారం ఇచ్చారు. తిరుమలకు వెళ్తే .. అంతే భక్తిగా కొండ దిగాలి కానీ రాజకీయాలు మాట్లాడవద్దని స్పష్టం చేశారు.