ఆంధ్రా ఊటీగా పేరుగాంచిన అరకు నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్న దట్టమైన పొగమంచు, ఎత్తైన కొండలు, లోయలు, అందమైన జలపాతాలు కనువిందు చేస్తుంటాయి.. నవంబర్, డిసెంబర్ నెలల్లో మాత్రమే వికసించే వలిసె పువ్వులు మరో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.అరకులోయ ప్రకృతి సౌందర్యానికి పేరుగాంచింది. శీతాకాలంలో వలిసపూలు పూసి కొండలన్నీ పసుపు వర్ణంతో మరింత అందంగా తయారవుతాయి.
అరకు చేరే మార్గంలో ఇరువైపులా దట్టమైన ఆడవులు ఉండే ఘాట్ రోడ్, ఆసక్తికరముగా ఆహ్లాదకరముగా ఉంటుంది. విశాఖపట్నం నుండి రోడ్డు, రైలు మార్గాలు రెండూ ఉన్నాయి. ఈశాన్య రైల్వే లైను కొత్తవలస – కిరండూల్లో అరకు, అరకు లోయ రెండు స్టేషన్లు ఉన్నాయి. రైలు ప్రయాణంలో “సిమిలిగుడ” అనే స్టేషను భారతదేశంలో అతి ఎత్తులో వున్న బ్రాడ్గేజ్ స్టేషను. బొర్రా గుహలు చూడటానికి ఇక్కడ దిగాలి. అరకులో వుండటానికి అన్ని తరగతుల వారికి సరిపడ వసతి గృహాలు ఉన్నాయి. దారిలో అనంతగిరి కొండలలో కాఫీ తోటలు ఉన్నాయి. అరకు నుండి 29 కి.మీ. దూరములో ఉన్న బొర్రా గుహలు ఒక పర్యాటక ఆకర్షణ. ట్రైబల్ మ్యూజియమ్ ఇంకొక ఆకర్షణ.