ఎన్టీఆర్ సినీ జీవితంలోకి వచ్చి 75 ఏళ్లు అయిన సందర్భంగా ఘనంగా వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నామని ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ ఛైర్మన్ టీడీ జనార్దన్ తెలిపారు. ఈనెల 14వ తేదీన విజయవాడలో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఎన్టీఆర్ కుమారులు, కుమార్తెలు హాజరవుతున్నారని వెల్లడించారు.అక్కినేని కుటుంబం, చిరంజీవి కుటుంబం నుంచి కొంతమంది హాజరవుతారన్నారు. వీరే కాక నిర్మాతలు, సినీ ఇండస్ట్రీ వారు కూడా హాజరవుతారని పేర్కొన్నారు. ఎన్టీఆర్తో కలిసి పని చేసిన వారిని ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నామని తెలిపారు. ఎన్టీఆర్ సినీ, రాజకీయ రంగంలో మకుటం లేని మహారాజు అని, అన్ని రాజకీయ పక్షాల వారిని ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నామన్నారు. త్వరలో ఎన్టీఆర్ జీవిత విశేషాలతో కూడిన పుస్తకాలను అన్ని భాషలలో విడుదల చేస్తామని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ చరిత్ర త్వరలో పాఠ్యపుస్తకాలలో కూడా వచ్చేలా కృషి చేస్తామని తెలిపారు.