వైసీపీ అధిష్ఠానం ఒత్తిడి వల్లే సోషల్ మీడియాలో అశ్లీల పోస్టులు పెట్టాల్సి వచ్చిందని ఆ పార్టీ నాయకుడు, రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌కుమార్ పోలీసుల విచారణలో చెప్పినట్లు తెలిసింది. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి శనివారం కస్టడీకి తీసుకున్న అనంతపురం నాలుగో పట్టణ పోలీసులు..అనంతపురానికి ఆదివారం అర్ధరాత్రికి చేరుకున్నారు. కేసు గురించి సమగ్రంగా విచారించారు. తొలిరోజు తనకేమీ తెలియదని చెప్పిన బోరుగడ్డ.. సోమవారం కొంత నోరు విప్పినట్లు తెలిసింది.
డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు సంబంధిత వీడియోల ఆధారంగా (చంద్రబాబు, లోకేశ్, వారి కుటుంబ సభ్యులను దూషించినవి) విచారించారు.పదేపదే ప్రశ్నలు సంధించడంతో తాను వైసీపీ హైకమాండ్ ఆదేశాల మేరకే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టానని చెప్పినట్లు సమాచారం. నిన్ను ఆదేశించిన ఆ వ్యక్తి ఎవరు’ అని ప్రశ్నించగా, ఆ విషయం గుర్తులేదని చెప్పినట్లు తెలిసింది. మరికొన్ని ప్రశ్నలకు మౌనంగా ఉన్నట్లు సమాచారం.బోరుగడ్డ కస్టడీ సమయం ముగుస్తుండటంతో సీఐ సాయినాథ్, ఎస్ఐ రాంప్రసాద్ సాయంత్రం 4.30గంటలకు కోర్టులో హాజరు పరిచారు. అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.