హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వెనుక ఏపీ సీఎం చంద్రబాబు కృషి ఉందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. అప్పట్లో 5 వేల ఎకరాల భూసేకరణ అంటే సామాన్యమైన విషయం కాదన్నారు. గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్ పోర్టుల కాన్సెప్ట్ వెనుక చంద్రబాబు ఉన్నారని తెలిపారు. ఆయన దార్శనికత వల్లే శంషాబాద్ విమానాశ్రయం సాధ్యమైందన్నారు. దేశాభివృద్ధిని నడిపించేది ఐటీ రంగమే అని చంద్రబాబు ఇప్పటికీ నమ్ముతారన్నారు. శంషాబాద్‌లోని నోవాటెల్‌లో ఎయిర్‌పోర్ట్ ప్రిడిక్టివ్ ఆపరేషన్ సెంటర్ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ… విమానాశ్రయాల నిర్వహణలో సరికొత్త సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. దేశంలోని 24 విమానాశ్రయాల్లో డిజియాత్ర టెక్నాలజీని వాడుతున్నామన్నారు. డేటా ఎనలిటిక్స్‌ను ఉపయోగించి మరింత మెరుగైన సేవలను అందిస్తామన్నారు. విమానాశ్రయం అంటే కేవలం రవాణా సౌకర్యం మాత్రమే కాదన్నారు. విమానాశ్రయం ఉపాధి మార్గం… సాంస్కృతిక కేంద్రం కూడా అన్నారు. ప్రపంచమంతా ఇప్పుడు భారత్ వైపు చూస్తోందన్నారు. వరంగల్, భోగాపురం ఎయిర్ పోర్టులను పూర్తి చేయాల్సి ఉందన్నారు. భోగాపురం విమానాశ్రయం 2026 జూన్ కల్లా పూర్తవుతుందన్నారు. మరో ఐదేళ్లలో 50 విమానాశ్రయాలను పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.