HomePoliticalస్వదేశానికి చేరుకోనున్న 'సిక్కోలు మత్స్యకారులు'

స్వదేశానికి చేరుకోనున్న ‘సిక్కోలు మత్స్యకారులు’

6 నెలల క్రితం జిల్లా నుంచి చెన్నైకి వలస వెళ్లిన ఇద్దరు గంగపుత్రులు

వేటకు వెళ్లి, అనుకోకుండా శ్రీలంక సముద్ర జలాల్లోకి చేరుకోవడంతో అరెస్ట్ చేసిన కోస్టుగార్డు పోలీసులు

విదేశాంగ శాఖతో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సంప్రదింపుల అనంతరం విడుదలకు అంగీకరించిన శ్రీలంక ప్రభుత్వం

శ్రీకాకుళం :అనుకోకుండా శ్రీలంక సముద్ర జలాల్లోకి ప్రవేశించి, గత 6 నెలలుగా అక్కడి జైల్లో మొగ్గుతున్న జిల్లాకు చెందిన మత్స్యకారులు తిరిగి స్వదేశానికి చేరుకున్నారు. ఈ మేరకు శ్రీలంక లోని భారత ఎంబసీ కార్యాలయం నుంచి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి, ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు కార్యాలయానికి శుక్రవారం సమాచారం అందించారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం రూరల్ మండలం పెద గనగళ్లవానిపేటకు చెందిన మత్స్యకార యువకులు దాసరి వెంకయ్య(35), గనగళ్ల కొర్లయ్య (33) ఉపాధి నిమిత్తం జూన్ 7న చెన్నై కి వలస వెళ్లారు. అక్కడి నుంచి జూన్ 25న మొత్తం 8మంది కలిసి, బోటులో సముద్రంలోకి వేటకు వెళ్లారు. అయితే సరిహద్దులు తెలియక శ్రీలంక సముద్ర జలాల్లోకి ప్రవేశించడం, ప్రమాదవశాత్తు మరో బోటును ఢీ కొట్టడంతో అక్కడి కోస్టుగార్డు పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై 15 రోజుల తరువాత కర్ణాటకకు చెందిన మత్స్యకార సంఘానికి విషయం తెలియగా.. వారు బాధిత కుటుంబాలకు సమాచారం అందించారు. దీంతో స్థానిక నాయకులు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ తదితరులు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు దృష్టికి సమస్యను తీసుకు వెళ్లారు.

విదేశాంగ శాఖతో రామ్మోహన్ నాయుడు సంప్రదింపులు..
జిల్లాకు చెందిన ఇద్దరు మత్స్యకారులు అనుకోకుండా శ్రీలంక కోస్టుగార్డు కు చిక్కు కోవడంతో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే గొండు శంకర్ వెంటనే స్పందించారు. బాధిత కుటుంబాలకు బియ్యం, రేషన్ సరుకులు అందజేశారు. అలాగే విదేశాంగ శాఖ మంత్రి ఎన్.జైశంకర్ ను కలిసి, మత్స్యకారులను స్వదేశానికి చేరుకునేలా చొరవ చూపాలని కోరారు. అలాగే భారత ఎంబసీకి సమాచారం అందించారు. ఈ మేరకు జరిగిన సంప్రదింపులు కొలిక్కి రావడంతో.. గంగపుత్రులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. కోర్టులో న్యాయ ప్రక్రియ పూర్తయిన కొద్ది రోజుల్లోనే మత్స్యకారులను ముందుగా కొలంబోకు, అక్కడి నుంచి విమానంలో స్వదేశానికి చేర్చనున్నట్లు సమాచారం అందించారు. దీనిపై బాధిత కుటుంబ సభ్యులు, పెద గనగళ్లవానిపేట నాయకులు ఆనందం వ్యక్తం చేశారు. దీనిపై చొరవ చూపిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, ఎమ్మెల్యే గొండు శంకర్ లకు కృతజ్ఞతలు తెలియజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img