HomePoliticalఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుకి.. భారీ ఊర‌ట‌

ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుకి.. భారీ ఊర‌ట‌

వైసీపీ హ‌యాంలో ప‌లు అభియోగాలతో ఏబీవీ స‌స్పెన్డ్ అయిన సంగ‌తి తెలిసిందే. కాగా ఏబీ వెంకటేశ్వరరావుకు ఏపీ ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. నిఘా విభాగాధిపతిగా పని చేసిన సమయంలో ఏరోస్టాట్, యూఏవీ భద్రత పరికరాల కొనుగోలు ప్రక్రియలో అక్రమాలకు పాల్పడ్డారంటూ ఏబీ వెంకటేశ్వరరావుపై వైసీపీ ప్రభుత్వం అభియోగాలు మోపింది.అయితే కూటమి సర్కార్ విచారణలో ఏబీ వెంకటేశ్వరరావుపై మోపిన అభియోగాల్లో వాస్తవం లేదని నిర్ధారణ కావడంతో ఆయనపై తదుపరి చర్యలు ఉపసంహరించుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆయన పదవీ విరమణ తర్వాత లభించే ప్రయోజనాలు అన్నీ యథాతథంగా పొందే అవకాశం ఏర్పడింది.

భద్రత పరికరాల కొనుగోలులో అక్రమాలకు పాల్పడ్డారంటూ 2020 డిసెంబర్ నెలలో ఏబీ వెంకటేశ్వరరావును నాటి వైసీపీ సర్కార్ అభియోగాలు నమోదు చేసింది. వాటిపై విచారణ అధికారిని నియమించింది. మొత్తం మూడు అభియోగాల్లో రెండు నిరూపితమైనట్లు పేర్కొని ఆయనపై చర్యలకు కేంద్ర హోంశాఖకు లేఖ రాసింది. ఇంక్రిమెంట్లు నిలుపుదల చేసేలా అప్పట్లో కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు ఇవ్వగా, ఆయన్ను సర్వీసు నుంచి తొలగించాలంటూ వైసీపీ సర్కార్ లేఖ రాసింది. అయితే కేంద్రం నుంచి దానిపై ఎలాంటి ఆదేశాలు రాలేదు.

ఈ క్రమంలో ఏబీ వెంకటేశ్వరరావు హైకోర్టు, సుప్రీం కోర్టు, క్యాట్‌లో న్యాయపోరాటం చేయడంతో ఆయన పదవీ విరమణకు ఒక రోజు ముందు వైసీపీ ప్రభుత్వం ఆయనను ప్రింటింగ్ స్టేషనరీ విభాగం డీజీగా నియమించింది. దీంతో ఈ ఏడాది మే నెలలో ఆ బాధ్యతలు చేపట్టిన రోజే పదవీ విరమణ చేశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఏబీ వెంకటేశ్వరరావుపై మోపిన అభియోగాలపై విచారణ జరపగా, అభియోగాలకు ఆధారాలు లేవని తేలడంతో న్యాయ సలహా, అడ్వకేట్ జనరల్ సలహా తీసుకుని ఈ అంశంలో ఆయనపై తదుపరి చర్యలన్నీ నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img