ఓ తప్పుడు కేసులో ఢిల్లీ సీఎం అతీశీని త్వరలో అరెస్టు చేస్తారని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ కేజ్రీవాల్ జోస్యం చెప్పారు. అంతకంటే ముందే ఆప్ సీనియర్ నేతల ఇళ్లపై కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు దాడులు జరుపుతాయని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. మహిళలకు నెలకు రూ.2,100 మహిళా సమ్మాన్ యోజన కింద ఇచ్చే పథకంతో పాటు వృద్ధులకు ఉచిత వైద్యం అందించే సంజీవని యోజన పథకానికి అనూహ్య స్పందన వస్తుండటంతో బీజేపీ అధిష్టానం బెంబేలెత్తిపోతోందన్నారు. అందుకే ఈడీ, సీబీఐ, ఐటీ ద్వారా అతీశీని తప్పుడు కేసులో అరెస్టు చేయించే యోచనలో ఉన్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. మరోవైపు తనను తప్పుడు కేసులో అరెస్టు చేసినా.. తర్వాత నిజమేంటో అందరికీ తెలుస్తుందని అతీశీ చెప్పారు. మరోవైపు, 2013లో ఆమ్ ఆద్మీ పార్టీకి 40 రోజుల పాటు మద్దతు ఇవ్వడం వల్లే ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడిందని, అదే తాము చేసిన పొరపాటని కాంగ్రెస్ పార్టీ నేత మాకెన్ అన్నారు.