తిరుమల శ్రీవారి ఆలయంపై నుంచి ఓ విమానం చక్కర్లు కొట్టింది. దీనిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆగమశాస్త్ర ప్రకారం శ్రీవారి ఆలయం గోపురం పై నుంచి విమానాలు వెళ్లడం నిషేధం. దీనిపై టీటీడీ ఎన్నోసార్లు కేంద్రానికి ఫిర్యాదు చేసింది. తిరుమల శ్రీవారి ఆలయ ప్రాంతాన్ని నో ఫ్లైయింగ్ జోన్‌గా ప్రకటించాలని కోరింది. అయితే దీన్ని కేంద్ర విమానాయాన శాఖ పట్టించుకోవడం లేదు. తరచూ శ్రీవారి ఆలయ గోపురం పై నుంచి విమానాలు వెళ్తుండటంపై వెంకన్న భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొద్ది రోజులుగా నిత్యం శ్రీవారి ఆలయం పై నుంచి విమానాలు వెళ్తున్నాయి.
ఇలాంటి రాకపోకలు సాగిస్తే ఏదైనా ఉపద్రవాలు సంభవిస్తాయని ఇప్పటికే ఆగమ పండితులు పలుసార్లు టీటీడీకీ సూచించారు.ఈ నేపథ్యంలో టీటీడీ అధికారులు.. శ్రీవారి ఆలయంపై విమానాల రాకపోకలపై నిషేధం విధించాలని, అలాగే నో ఫ్లై జోన్‌గా ప్రకటించాలని పలుమార్లు టీటీడీ పాలకమండలి ద్వారా కేంద్ర విమానాయాన శాఖకు విజ్ఞప్తి చేశారు. అయితే రేణిగుంట విమానాశ్రయంలో పెరిగిన ట్రాఫిక్ నేపథ్యంలో నో ఫ్లై జోన్‌గా ప్రకటించేందుకు సాధ్యం కాదని అయితే ఆలయానికి సమీపంలో విమానాల రాకపోకలు సాగకుండా చూస్తామని అధికారులకు కేంద్రం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.