*వైసీపీలో అడుగడునా అవమానాలే…?
*మర్రి అడుగులు టీడీపీవైపేనా…?
వైఎస్సార్ సీపీకి చెందిన ఎమ్మెల్సీ, ఆ పార్టీ సీనియర్ నాయకుడు మర్రి రాజశేఖర్ పార్టీ మారనున్నారా..? జిల్లాలోనూ, చిలకలూరిపేట నియోజకవర్గంలోనూ ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది. వైఎస్సార్ సీపీ అవిర్బావం నుంచి పార్టీలో కొనసాగుతూ పార్టీ కష్టకాలంలో ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించారు. నాటి ఉప ఎన్నికల్లో గెలుపు కోసం పాటుపడిన మర్రి రాజశేఖర్ పార్టీ మారుతున్నారంటే ముందుగా నమ్మరు. కాని వైసీపీలో ఆయన పడ్డ అవమానాలు, సరైన ప్రాతినిధ్యం ఇవ్వకపోవడం తదితర అంశాలతో పాటు, ఇటీవల కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం కూడా మర్రి రాజశేఖర్ పార్టీని వీడుతున్నారన్న వాదనకు బలం చేకూరుస్తున్నాయి. సంక్రాంతిలోపు ఆయన అనుచరులతో పార్టీ మారనున్నట్లు ప్రచారం జరుగుతుంది.
మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ సోమేపల్లి సాంబయ్య వారసుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించిన మర్రిరాజశేఖర్ …. పేదల లాయర్‌గా పిలుచుకొనే వారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ బలపరిచిన ఇండిపెండింట్ అభ్యర్థిగా తొలిసారి పోటీ చేసిన మర్రిరాజశేఖర్, టీడీపీకి చెందిన ప్రత్తిపాటి పుల్లారావుపై గెలిచారు. ఆయన పాలన కాలంలోనే నియోజకవర్గంలో అంతర్గత రోడ్లు, లోలెవల్ చాప్టాలు, పసుమర్రు, నరసరావుపేట, చిరుమామిళ్ల లాంటి పెద్ద బ్రిడ్జిలు ఏర్పాటయ్యాయి. ఆ తర్వాత వైసీపీ ఆవిర్బావం తర్వాత ఆ పార్టీలో చేరిన మర్రి రాజశేఖర్ పార్టీలో కీలక నేతగా వ్యవహరించారు. కాని అనూహ్యంగా 2019 ఎన్నికల్లో ఎన్ఆర్ ఐ విడదల రజిని పార్టీలో చేరిన కొద్ది రోజుల్లోనే టికెట్ కేటాయించారు. ఎన్నికల్లో ఆమెను గెలిపిస్తే ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిని చేస్తానని వైసీపీ అధినేత జగన్ ఎన్నికల సభలో హామీ ఇచ్చారు. మంత్రి పదవి మాట దేవుడెరుగు. ఐదేళ్ల కాలంలో విడదల రజినిని మంత్రిగా చేసి రాజశేఖర్‌కు ఎమ్మెల్సీ ఇవ్వడానికి సైతం వెనుకంజ వేశారు. ఎన్నికలకు ముందు ఏడాదిలో మర్రి కి కేవలం ఎమ్మెల్సీ పదవితోనే సరిపెట్టారు. ఐదేళ్ల పాటు అధికారం ఉన్నా మర్రి రాజశేఖర్ వర్గం ప్రతిపక్షంలో కన్నా దారుణమైన పరిస్థితి అనుభవించారు. అప్పట్లోనే పలు మార్లు వివిధ పార్టీల అధినేతల నుంచి తమ పార్టీలోకి రావాలని ఆహ్వానం వచ్చినా మర్రి రాజశేఖర్ నిరాకరించారు. కాని ప్రతి సందర్బంలోనూ ఎదురైన అవమానాలతో పార్టీ మారాలనే అలోచనకు వచ్చినట్లు తెలుస్తుంది.
ఇటీవల రైతు సమస్యలపై జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేయాలని వైసీపీ అధిష్టానం పిలుపు నిచ్చింది. అయితే ఆ కార్యక్రమానికి మర్రి రాజశేఖర్ హాజరుకాలేదు. అనంతరం ఆయన జనసేనలో చేరుతున్నారన్న వార్తలు వచ్చాయి. అయితే గతం నుంచి నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, మరో కేంద్ర మంత్రితో మర్రికి ఉన్న సంబంధాల దృష్ట్యా టీడీపీలోకి వెళ్లే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా ఉన్న పదవికి రాజీనామా చేస్తారా..? ఆయనకు ఆ పార్టీ నుంచి ఎటువంటి హామీలు లభించనున్నాయన్న అంశాలపై చర్చ కొనసాగుతుంది. గతం నుంచి చిలకలూరిపేట నియోజకవర్గంలో ప్రత్తిపాటి పుల్లారావు టీడీపీ పెద్ద దిక్కుగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఆ పార్టీ నుంచే ఎమ్మెల్యగా ఉన్నారు. ఈ క్రమంలో మర్రి రాజశేఖర్ టీడీపీ చేరిక ప్రత్తిపాటి వర్గం వ్యతిరేకించే అవకాశం లేకపోలేదు. ఈ విషయాన్ని ఏ విధంగా పార్టీ అధిష్టానం హ్యాండిల్ చేస్తుందో అన్న ఆసక్తి నెలకొని ఉంది.