బాలీవుడ్ క్వీన్, మండి ఎంపీ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఎమర్జెన్సీ . 1975-77 నాటి ఎమర్జెన్సీ పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమాలో కంగనా రనౌత్.. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్రను పోషించింది. ఆమె దర్శకురాలు కూడా. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ చిత్రం.. పలు వివాదాల కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. అయితే, ఎట్టకేలకు తాజాగా ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. జనవరి 17న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో కంగనా రనౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రం విషయంలో తాను కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఎమర్జెన్సీ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయకుండా ఉండాల్సిందని.. అది తాను చేసిన పెద్ద తప్పు అని వ్యాఖ్యానించారు.
ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించడం, సినిమా విడుదల ఆలస్యం కావడం వల్ల తాను చాలా బాధపడ్డట్లు తెలిపింది. డైరెక్ట్‌గా ఓటీటీలోకి వెళ్లుంటే మంచి డీల్ దొరికేదని అభిప్రాయపడ్డారు. అప్పుడు సెన్సార్ బాధలు కూడా ఉండేవి కావన్నారు. అంతేకాకుండా ఈ చిత్రానికి దర్శకత్వం వహించాలనుకోవడం తాను చేసిన మొదటితప్పుగా కంగన చెప్పుకొచ్చారు. ఇందిరా గాంధీ మూడు పర్యాయాలు ప్రధానిగా చేశారని.. ఆ సమయంలో ఎన్నో ఘటనలు చేటుచేసుకున్నట్లు గుర్తు చేశారు. గతంలో ఇందిరా గాంధీపై ‘కిస్సా కుర్సీ కా’ మూవీ వచ్చిందని కంగన తెలిపారు. ఆ చిత్రాన్ని ఎవరూ చూడలేదని.. అందుకు కారణం రిలీజ్ కాకుండానే ఆ చిత్రాన్ని బ్యాన్ చేశారన్నారు. ఆ చిత్రానికి సంబంధించిన ఫైల్స్ కూడా దగ్ధం చేసినట్లు చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఇందిరా గాంధీపై ఏ ఒక్కరూ సినిమా తీసే ధైర్యం చేయలేదన్నారు. ఇప్పుడు ఈ సినిమా చూశాకా నేటి తరం వారికి ఇందిరా గాంధీ మూడుసార్లు ప్రధాని ఎలా అయ్యారో తెలుస్తుందని చెప్పుకొచ్చారు.