కొమురవెల్లి మల్లన్న జాతర ఆదివారం ప్రారంభమైంది. సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో జాతర ఘనంగా ప్రారంభమైంది. రెండు నెలల పాటు ఈ జాతర జరగనుంది. సంక్రాంతి పండుగ తర్వాత మొదటి ఆదివారం కావడంతో మల్లికార్జున స్వామివారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఈరోజు ప్రారంభమైన జాతర ఉగాదికి ముందు వచ్చే ఆదివారం (మార్చి 23న) ముగియనుంది. ఈ ఆలయంలో ప్రతి ఆదివారం విశేష కార్యక్రమాలు నిర్వహిస్తారు. భక్తులు ఆలయానికి వెళ్లి బోనాలు సమర్పిస్తారు. పట్నం వేసి స్వామి వారి కల్యాణం జరిపించి మొక్కు తీర్చుకుంటారు. తెలంగాణ, ఏపీతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా వేలాది భక్తులు తరలి వస్తారు. భక్తుల కోసం ఆలయ పరిసరాల్లో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాజగోపురం పక్కన ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. వాటిపై చలువ పందిళ్లు వేయించారు. కొత్తగా నిర్మించిన ప్రసాదాల విక్రయం, ఆర్జిత సేవల రసీదుల అందజేత కేంద్రం వద్ద పక్కా క్యూలైన్లు నిర్మించారు.