మీరు మీ మొబైల్ ఎత్తగానే, మీకు ఒక మెసేజ్ వస్తుంది గమనించారా? సైబర్ నేరగాళ్ల గురించి అలర్ట్‌గా ఉండాలని ఈ మెసేజ్‌లో చెబుతారు. ఇలాంటి మెసేజ్‌లు ఎందుకు వస్తున్నాయో మీకు ఇప్పుడు చెబుతున్నాం.. సైబర్ కేటుగాళ్లు ఏకంగా కలెక్టర్ల ఫొటోలు పెట్టుకుని, వసూళ్లకు దిగుతున్నారు.ఏపీలో ఫేక్ బ్యాచ్ రెచ్చిపోతోంది. కలెక్టర్ల ఫొటోలతో సైబర్ కేటుగాళ్లు బురిడీ కొట్టిస్తున్నారు. బాపట్ల, అల్లూరి సీతారామరాజు జిల్లాల కలెక్టర్ల ఫోటోలతో.. జిల్లా అధికారులు, ఉద్యోగులతో వాట్సాప్ చాట్ చేశారు. ఫేక్ వాట్సాప్ అకౌంట్లపై కలెక్టర్లు ఫిర్యాదు చేశారు.ఫేక్ మెసేజ్‌లపై స్పందించవద్దని కలెక్టర్లు సూచిస్తున్నారు.
సైబర్ నేరగాళ్లు.. వివిధ రూపాల్లో రెచ్చిపోతున్నారు. సామాన్యులనే కాదు.. జిల్లా కలెక్టర్లను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఏపీలో కలెక్టర్ల ఫోటోలతో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి.. వాట్సాప్ చాట్ చేస్తూ అధికారులను బురిడి కొట్టించే ప్లాన్ చేశారు. అధికారులు వెంటనే అప్రమత్తమవడంతో ప్రమాదం తప్పింది. బాపట్ల జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి ఫోటోతో ఫేక్ వాట్సాప్ క్రియేట్ చేసిన సైబర్ కేటుగాళ్లు.. ఫేక్ నంబరు నుంచి అధికారులతో చాట్ చేశారు. వెంటనే అలర్ట్ అయిన కలెక్టర్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. చాట్ చేసిన ఫోన్ నెంబర్ శ్రీలంకకు చెందినదిగా గుర్తించారు. ఫేక్ అకౌంట్ పట్ల ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వెంకట మురళి సూచించారు.అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఫోటోతో ఫేక్ వాట్సాప్ ఐడీ క్రియేట్ చేసిన సైబర్ నేరగాళ్లు అధికారులతో చాట్ చేశారు. ఇలాంటి ఘటన పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ సూచించారు. ఎవరికైనా డబ్బులు అడిగితే సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేయాలని సూచించారు.టెక్నాలజీ పెరిగే కొద్దీ నేరాలు కూడా అదే స్థాయిలో పరుగులు పెడుతున్నాయి.. వాళ్లు వీళ్లు అని కాదు ఎవరైనా టార్గెట్ చేస్తున్నారు నేరగాళ్లు.. హాయ్ ప్రొఫైల్ వ్యక్తులు అధికారుల పేరుతో ఐడీలు క్రియేట్ చేసి వసూళ్లకు తెరలేపుతున్నారు. అందుకే అనుక్షణం అప్రమత్తంగా ఉండండి?