HomePoliticalఏపీని అగ్ర‌స్థానంలో నిలపెడ‌దాం..సీఎస్

ఏపీని అగ్ర‌స్థానంలో నిలపెడ‌దాం..సీఎస్

సులభతర వాణిజ్యం విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత పదేళ్లలో ఎక్కువ పర్యాయాలు దేశంలో మొదటి స్థానంలో నిలవడం జరిగిందని, ఆ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు సంబంధిత శాఖలు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ఆదేశించారు. రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌పై సోమవారం రాష్ట్ర సచివాలయంలో సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ అనేది ప్రపంచ బ్యాంక్ గ్రూప్ స్థాపించిన ర్యాంకింగ్ వ్యవస్థ అని, వ్యాపారాలకు మెరుగైన, సరళమైన నిబంధనలు అందుబాటులో ఉంటే సులభతర వాణిజ్యానికి అవకాశం ఉంటుందని తెలిపారు.

2024లో పరిశ్రమ మరియు అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం నేతృత్వంలోని వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక (బీఆర్ఏపీ) 2024 ద్వారా వ్యాపారం చేయడంలో సౌలభ్యాన్ని పెంచడంపై భారతదేశం ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు. సులభతర వాణిజ్య విధానంతో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఎక్కువగా ఉంటుందని, ఆ దిశగా ఆయా శాఖలు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంశంపై ప్రత్యేక దృష్టి సారించి ఏపీని మొదటి స్థానంలో నిలిపేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు.కేంద్ర ప్రభుత్వం బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్ (బీఆర్ఏపీ) 2024కు సంబంధించి ఫిబ్రవరి 15 తుది గడువుగా నిర్ణయించిందని, కావున 10వ తేదీలోగా సంబంధిత శాఖలు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సంబంధించిన కంప్లయన్స్ ప్రక్రియను పూర్తి చేయాలని సీఎస్ ఆదేశించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సంబంధించి ఇంకా కొన్ని శాఖలు నోడల్ అధికారులను నియమించాల్సి ఉందని, వారిని వెంటనే నియమించాలని అన్నారు. తొలుత రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శి డాక్టర్ ఎన్ యువరాజ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img