జయలక్ష్మి ఫర్టిలైజర్స్ అధినేత, తణుకు మాజీ ఎమ్మెల్యే దివంగత వైటీ రాజా తల్లి, ప్రముఖ పారిశ్రామికవేత్త యలమర్తి నారాయణ చౌదరి భార్య రాజేశ్వరిదేవి నిన్న పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో మృతి చెందారు. సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. ప్రముఖ సినీ నటుడు రానాకు రాజేశ్వరి స్వయానా అమ్మమ్మ. రానా తండ్రి సురేశ్ ఆమెకు అల్లుడు. ఈ నేపథ్యంలో నిన్న ఆమె అంతిమయాత్రలో పాల్గొన్న రానా అమ్మమ్మ పాడె మోశారు. కాగా, రాజేశ్వరిదేవికి పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే, నిడదవోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్ బూరుగుపల్లి శేషారావు భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. పలువురు టీడీపీ నేతలు కూడా రాజేశ్వరికి నివాళులు అర్పించారు.