సినీ రంగానికి చేసిన సేవలకు గాను బాలకృష్ణకు భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో బాలయ్యకు సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్నానని, మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందానని… ఈ సమయంలో ఇలాంటి పురస్కారానికి ఎంపిక కావడం ప్రత్యేకంగా ఉందని చెప్పారు. పురస్కారాలు, బిరుదుల కోసం కాకుండా… నిబద్ధతతో మన బాధ్యతలను మనం నిర్వర్తించాలని అన్నారు. మనకు ఎంతో ఇచ్చిన సమాజానికి మనం ఏదైనా తిరిగి ఇవ్వాలని చెప్పారు. పద్మభూషణ్ ఎప్పుడో రావాలని ఎంతోమంది అంటున్నారని… ఆలస్యం ఏమీ కాలేదని బాలయ్య అన్నారు.
నాన్న వందో జయంతి ఇటీవలే పూర్తయిందని, ఆయన నటించిన ‘మన దేశం’ విడుదలై 75 ఏళ్లు అయిందని, తన చిత్రాలు వరుసగా హిట్స్ అందుకోవడం… ఇవన్నీ వచ్చిన సందర్భంగా పద్మభూషణ్ రావడం సంతోషంగా ఉందని చెప్పారు. తాను ఎప్పుడూ ఆధ్యాత్మిక చింతనతో ఉంటానని, పూజలు ఎక్కువగా చేస్తుంటానని తెలిపారు. తనకు పద్మభూషణ్ రావడం పట్ల అభిమానులు, ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని బాలయ్య అన్నారు. పురస్కారం తమకే వచ్చినట్టు వారు భావిస్తున్నారని చెప్పారు. అభిమానుల నుంచి అంతటి ప్రేమాభిమానాలను పొందడం తన పూర్వజన్మ సుకృతమని అన్నారు. జీవితంలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఎవరు ఎన్ని అనుకున్నా, మనకు నచ్చిన విధంగానే ముందుకు సాగిపోవాలని చెప్పారు. బసవతారకం ఆసుపత్రి ఛైర్మన్గా బాధ్యతలను చేపట్టి 15 ఏళ్లు అవుతోందని… ఆసుపత్రి ద్వారా ఎంతోమందికి సేవ చేస్తుండటం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.