అక్కినేని నాగచైతన్య, చందు మొండేటి కాంబినేషన్లో వస్తున్న చిత్రం తండేల్. ఈ నెల 7న విడుదల అవుతోంది. దీంతో చిత్రబృందం ముమ్మరంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో ‘తండేల్ జాతర’ పేరిట ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. 40 ఏళ్లు వచ్చినా ఇప్పటికీ దేవిశ్రీ పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్‌గానే ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘తండేల్’ ప్రీరిలీజ్ వేడుకలో నిర్మాత బన్నీ వాసు… డీఎస్పీ పెళ్లి విషయమై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బన్నీ వాసు మాట్లాడుతూ… “తండేల్ మూవీ ఇంత బాగా రావడానికి కారణం డీఎస్పీ. ఆయనను ఇంట్లో ముద్దుగా ‘బుజ్జి’ అని పిలుస్తారు. మా సినిమాలో కూడా ‘బుజ్జి తల్లి’ ఉంది. మా ‘బుజ్జి’ ఇక్కడే ఉన్నాడు. కానీ, ఆ తల్లి (దేవిశ్రీకి కాబోయే భార్య) ఎక్కడ ఉందో…! మాకు పెళ్లిళ్లు అయి పిల్లలు కూడా పుట్టారు. కానీ దేవీ బ్యాచిలర్‌గానే ఉన్నాడు. త్వరలోనే ఆయనకు కూడా పెళ్లి జరగాలి. పిల్లలు పుట్టాలి. ఆ పిల్లలు కూడా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు కావాలని కోరుకుంటున్నా అని అన్నారు. దీనిపై అక్కడే ఉన్నా దేవీశ్రీ స్పందిస్తూ “పెళ్లి మన చేతుల్లో లేదు. రాసి పెట్టి ఉంటేనే జరుగుతుంది” అంటూ సైగలు చేయడం వీడియోలో ఉంది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు.