ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మంత్రి లోకేశ్, జనసేనాని, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, వారి కుటుంబ సభ్యులను దూషించిన కేసులో అరెస్టై మధ్యంతర బెయిలుపై ఉన్న వైసీపీ నేత, రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ లొంగిపోయాడు. తల్లికి ఆరోగ్యం బాగాలేదన్న కారణంతో మధ్యంతర బెయిలు పొందిన అనిల్ బెయిలు గడువు నిన్న సాయంత్రంతో ముగిసింది. అయినప్పటికీ లొంగిపోకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో లొంగిపోయాడు. తల్లి అనారోగ్యం పేరుతో బెయిలు పొడిగించుకునేందుకు అనిల్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మధ్యంతర బెయిలును పొడిగించే ప్రసక్తే లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. మంగళవారం (11న) సాయంత్రం 5 గంటల్లోపు లొంగిపోవాల్సిందేనని స్పష్టం చేసింది. అయినప్పటికీ అజ్ఞాతం వీడకపోవడంతో లొంగిపోతాడా? లేదా? అన్న చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ఈ ఉదయం ఆయన మీడియా కంట పడకుండా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు చేరుకుని జైలు సూపరింటెండెంట్ వద్ద లొంగిపోయాడు.