పారిశుద్ధ్యం, స్వచ్ఛత పట్ల ప్రజల్లో మార్పు రావాలి
ప్రజల్లో చైతన్యం కోసం మంగళగిరి నియోజకవర్గంలో డోర్ టూ డోర్ ప్రచారం
స్వచ్ఛతలో మంగళగిరిని ఆదర్శ కార్పోరేషన్ గా తీర్చిదిద్దుతాం
మంగళగిరిలోని ఎకో పార్క్ లో స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి లోకేష్
..పారిశుద్ధ్య కార్మికుడితో ముఖాముఖి, ఘనంగా సత్కరించిన మంత్రి
మంగళగిరిః పారిశుద్ధ్యం, పరిసరాల పరిశుభ్రత పట్ల ప్రజల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని, ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు మంగళగిరి నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మంగళగిరి ఎయిమ్స్ సమీపంలోని ఎకో పార్క్ లో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. పార్క్ లో చెత్తను శుభ్రంచేసి స్వయంగా చెత్తకుండీలో వేశారు.
పారిశుద్ధ్య కార్మికుడితో మంత్రి ముఖాముఖి
స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికుడు ఎమ్.నాగార్జునతో మంత్రి లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. అతని యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఏ ఊరు, ఎక్కడ పనిచేస్తున్నారని మంత్రి ప్రశ్నించగా.. తాను మంగళగిరి 16వ వార్డులో నివాసం ఉంటున్నానని, 15 ఏళ్ల నుంచి పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాని అతడు తెలిపాడు. ఎంతమంది పిల్లలు, ఎక్కడ చదువుతున్నారని అడగగా… తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని.. అమ్మాయి పదో తరగతి, అబ్బాయి తొమ్మిదో తరగతి చదువుతున్నారని, ఇద్దరినీ ప్రభుత్వ మున్సిపల్ పాఠశాలలో చదివిస్తున్నానని చెప్పాడు. ప్రభుత్వ పాఠశాలలో చదువు బాగుందని, మధ్యాహ్న భోజనం కూడా బాగా పెడుతున్నారని చెప్పాడు. మంత్రి స్పందిస్తూ.. ప్రభుత్వ పాఠశాలలను ఇంకా మెరుగుపర్చాల్సి ఉందని, మధ్యాహ్న భోజన పథకంలో మెనూ కూడా మార్చామని ఈ సందర్భంగా చెప్పారు. పారిశుద్ధ్య నిర్వహణకు అవసరమైన సామాగ్రి ఏవిధంగా ఉందని, చెత్తకుండీలు ఉన్నాయా అని అడగగా.. చేతికి వేసుకునే గ్లోవ్స్ మరింత మందంగా ఉండాలని సూచించాడు. ఎకో పార్క్ లో ఇంకా ఏమేం చేస్తే బాగుంటుందని మంత్రి అడగగా.. ప్రతి ఆదివారం పిల్లలు పెద్దఎత్తున పార్క్ కు వస్తున్నారని, వాకర్స్ ఆనందంగా ఉన్నారని సమాధానం ఇచ్చాడు. పిల్లలు బాగా చదవాలని, వారు ఎదిగేలోగా మంగళగిరి బాగా అభివృద్ధి చెందాలని మంత్రి ఆకాంక్షించారు.
స్వచ్ఛత పట్ల ప్రజల్లో మార్పు తీసుకురావాలి
పారిశుద్ధ కార్మికులు ప్రజలంతా నిద్రకు ఉపక్రమించి తర్వాత వారు మేల్కొని పరిసరాలను పరిశుభ్రంగా మారుస్తారని మంత్రి ప్రశంసించారు. మంగళగిని పరిశుభ్రంగా మార్చారని కొనియాడారు. మంగళగిరి ఎకో పార్క్ బాగుందని, మరింతగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. పారిశుద్ధ్యం, పరిశుభ్రత పట్ల ప్రజల్లో మార్పు రావాలి. అందుకే కూటమి ప్రభుత్వం ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తోంది. స్వచ్ఛతలో మంగళగిరిని ఆదర్శ కార్పోరేషన్ గా తీర్చిదిద్దుతాం. అందుకు కావాల్సిన చర్యలు చేపడతాం. ప్రజలకు కూడా బాధ్యత పెడితే పారిశుద్ధ్య కార్మికుల కష్టాలు తెలుస్తాయి. అప్పుడు రోడ్లపై ఇష్టానుసారంగా చెత్త వేయరు. ఇతర దేశాలకు వెళ్లినప్పుడు ఎక్కడా చెత్తవేయం. ఇక్కడ మాత్రమే ఇష్టానుసారంగా వ్యవహరిస్తాం. మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి. మంగళగిరిలో భూగర్భ డ్రైనేజీ, అండర్ వాటర్, గ్యాస్, పవర్ అందుబాటులోకి వస్తే చాలా వరకు సమస్యలు తీరిపోతాయి. చెరువుల ఆధునీకరణకు దాదాపు రూ.3కోట్లు వెచ్చిస్తున్నాం. పారిశుద్ధ్యం నిర్వహణలో మంగళగిరిని నెం.1 నిలబెడతామని అన్నారు.ముఖాముఖి అనంతరం పారిశుద్ధ్య కార్మికుడు నాగార్జునను మంత్రి శాలువాతో ఘనంగా సత్కరించారు. అంతకుముందు ఎకో పార్క్ లో వాకింగ్ చేసే మంగళగిరివాసులకు సొంత నిధులు రూ.5 లక్షలు వెచ్చించి ఉచిత ప్రవేశం కల్పించిన మంత్రి నారా లోకేష్ ను నేచర్ వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు పాల్గొన్నారు.