HomeDevotionalర‌క్షాబంధ‌న్ కి..అర్థం ఇదే

ర‌క్షాబంధ‌న్ కి..అర్థం ఇదే

రాఖీ, రక్షా బంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంద్యాల పూర్ణిమ అని కూడా పిలుస్తారు.అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు. రాఖీ అనగా రక్షణ బంధం. చెల్లి తన అన్నయ్య మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ అన్నయ్యకు కట్టేదే ఈ రాఖీ.కాగా రాఖీపౌర్ణమి నాడు నిత్యపూజలు చేసి ఇంటిలో ఒక చోట ముగ్గు, పీట వేసి సోదరుడుని కూర్చోబెట్టి బొట్టు పెట్టి రాఖీ కట్టవలెను. మిఠాయిలు తినిపించవలెను. సోదరుడు కృతజ్ఞతగా తన సోదరికి ధనము, బట్టలు, నగలు గానీ కానుకగా ఇవ్వడం ఆచారం.

పూర్వం దేవతలకు, రాక్షసులకు మధ్య పుష్కరకాలం యుద్ధం సాగింది. యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు తన పరివారమంతటినీ కూడగట్టుకొని అమరావతిలో తలదాచుకుంటాడు. భర్త నిస్సాహాయతను చూసిన ఇంద్రాణి తరుణోపాయం ఆలోచిస్తుంది. భర్త దేవేంద్రుడికి సమరం చేయడానికి ఉత్సాహాన్ని కల్పిస్తుంది. సరిగ్గా ఆ రోజు శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీనారాయణులను పూజించి రక్షాను దేవేంద్రుడి చేతికి కడుతుంది. అది గమనించిన దేవతలందరూ వారు పూజించిన రక్షలను తీసుకువచ్చి ఇంద్రుడికి కట్టి పంపుతారు. సమరంలో గెలిచిన ఇంద్రుడు తిరిగి త్రిలోక ఆధిపత్యాన్ని పొందుతాడు. శచీదేవి ప్రారంభించిన ఆ రక్షాబంధనం.. నేడు రాఖీ పండుగగా ఆచారమైందని పురాణాలు చెబుతున్నాయి.

ఇతిహాసాల ప్రకారం చూస్తే ద్రౌపది, శ్రీకృష్ణుడి కి అన్నాచెల్లెల అనుబంధం అత్యంత గొప్పగా కనిపిస్తుంది. శిశుపాలుడి ని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుని చూపుడు వేలుకు రక్తం ధారగా కారుతుందట. అది గమనించిన ద్రౌపది తన పట్టుచీర కొంగు చింపి వేలికి కట్టు కట్టిందట. దానికి కృతజ్ఞతగా ఎల్లవేళలా అండగా ఉంటానని శ్రీకృష్ణుడు ద్రౌపదికి హామీ ఇస్తాడు. అందుకు ప్రతిగా దుశ్శాసనుడి దురాగతం నుండి ఆమెను కాపాడుతాడు. శ్రీ మహావిష్ణువు బలి చక్రవర్తి కోరిక మేరకు అతనితోపాటు పాతాళంలో ఉండిపోతాడు. శ్రీమహాలక్ష్మి వెళ్లి బలిచక్రవర్తికి రక్షాబంధంకట్టి, తన భర్తను వైకుంఠానికి తీసుకొనిపోతుంది. అందుకే రక్షాబంధానికి ఇంత ప్రాధాన్యత ఏర్పడింది.

యేన బద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలః |
తేన త్వామభి బధ్నామి రక్షమాచల మాచల ||

పై శ్లోకాన్ని పఠిస్తూ సోదరి-సోదరునకు విజయ ప్రాప్తి కోసం సోదరుని ముంజేతికి రాఖీ కట్టవలెను. శ్రీ మహావిష్ణువు శక్తిచే మహాబలుడు అయిన బలిచక్రవర్తిని బంధించినట్లుగా, ఓ రక్షాబంధనమా ! నీవు చలించక వీనికి రక్షణ కల్పించుము అని పై శ్లోకం అర్దం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read