ఎన్టీఆర్ అభిమానులు ఇప్పుడు చాలా అసంతృప్తితో ఉన్నారు. అనేక అంచనాల మధ్య వచ్చిన ‘వార్ 2’ పరాజయంపాలు కావడమే అందుకు కారణం. ఎన్టీఆర్ బాలీవుడ్ లో నేరుగా చేసిన సినిమా ఇది. రికార్డుల పరంగా ఈ సినిమా ఎన్టీఆర్ కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలిచిపోతుందని అంతా భావించారు. కానీ ఈ సినిమా అంచనాలకు చాలా దూరంలో నిలిచిపోయింది. ఎన్టీఆర్ మల్టీస్టారర్ సినిమాలు చేయడం .. ఆ కథల్లో తన ఇమేజ్ ను తగ్గించుకుని చేయడం ఆయన అభిమానులలో అసంతృప్తిని కలిగించింది. ఈ సినిమా ఫలితం ఎన్టీఆర్ కి కూడా చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఇకపై మల్టీ స్టారర్ చేయకపోవడమే మంచిదనే ఆలోచనలో ఆయన ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ సినిమానే ఆయనకి బ్లాక్ బస్టర్ ఇవ్వగలదనే నమ్మకంతో అంతా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ‘దేవర 2’ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది.ఎన్టీఆర్ కి ‘జనతా గ్యారేజ్’ సినిమాతో హిట్ ఇచ్చిన కొరటాల, ‘దేవర’ సినిమాతో ఆ స్థాయి హిట్ ను నమోదు చేయకలేకపోయాడు. ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని అప్పట్లో అనుకున్నారు. కానీ ఆశించిన స్థాయి ఫలితం రాకపోవడంతో ఎవరూ ఆ ప్రస్తావన తీసుకురాలేదు. కానీ ఆ సినిమాకి సీక్వెల్ ఉందనే ఒక టాక్ మళ్లీ తెరపైకి వచ్చింది. కొరటాల అందుకు సంబంధించిన పనిలోనే ఉన్నారని అంటున్నారు. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.