ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తున్నారని తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రశంసలు కురిపించారు. రాష్ట్రాభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ లక్షల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారని, చంద్రబాబు వాటిని సమర్థంగా వినియోగిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. మంగళవారం ఉదయం తన పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా మల్లారెడ్డి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారం మందగించిందని, పరిస్థితి పూర్తిగా తలకిందులైందని అన్నారు. “గతంలో ఏపీలో ఆస్తులు అమ్ముకుని హైదరాబాద్ వచ్చేవారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. తెలంగాణకు చెందినవారే ఇప్పుడు ఏపీలో ఆస్తులు కొంటున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు” అని ఆయన వివరించారు. ప్రతి ఏటా తన పుట్టినరోజునాడు స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీ అని మల్లారెడ్డి తెలిపారు. గతేడాది తాను యూనివర్సిటీలు కావాలని స్వామిని కోరుకున్నానని, ఇప్పుడు దేశంలోనే మూడు పెద్ద డీమ్డ్ యూనివర్సిటీలను నడుపుతున్నానని గుర్తు చేసుకున్నారు.అదే సమయంలో తెలంగాణలోని గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై కూడా ఆయన మాట్లాడారు. “కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణలో దేశంలో ఎక్కడా జరగనంత అభివృద్ధి జరిగింది. కేటీఆర్ ఎన్నో మల్టీ నేషనల్ కంపెనీలను హైదరాబాద్కు తీసుకొచ్చారు. మళ్లీ కేసీఆర్ అధికారంలోకి వస్తేనే తెలంగాణకు ఆ పాత రోజులు తిరిగి వస్తాయి” అని మల్లారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.