HomeDevotional28 లక్షల దీపాలతో.. కొత్త ప్రపంచ రికార్డు

28 లక్షల దీపాలతో.. కొత్త ప్రపంచ రికార్డు

దీపావ‌ళి వేడుక‌ల‌కి అయోధ్య న‌గ‌రం ముస్తాబ‌వుతోంది. ఒకేసారి ల‌క్ష‌లాది దీపాలు వెలిగించి ప్రపంచ రికార్డు సృష్టించేందుకు సిద్ధమైంది. ఏటా దీపావళి పర్వదినానికి ముందు రోజు అయోధ్యలోని సరయూ నదీ తీరంలో దీపోత్సవ్ ) కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. ఇందులో భాగంగానే గతేడాది ఏకంగా 25 లక్షల దీపాలు ఒకేసారి వెలిగించి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సృష్టించింది. అయితే ఈ ఏడాది 28 లక్షల దీపాలతో కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాలని యూపీ ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే అక్టోబర్‌ 30న జరిగే దీపోత్సవ్‌ వేడుకలకు అయోధ్యా నగరి ముస్తాబవుతోంది. సరయూ నదీ తీరంలో దీపోత్సవానికి ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 51 ఘాట్‌లలో ఒకేసారి 28 లక్షల దీపాలు వెలిగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 30 వేల మంది వాలంటీర్లు ఈ దీపోత్సవం కార్యక్రమంలో భాగం కానున్నారు.

ఇక రామ మందిరం నిర్మాణం తర్వాత తొలి సారి జరుగుతున్న దీపావళి పండుగ కావడంతో ఈ దీపోత్సవాన్ని మరింత అద్భుతంగా నిర్వహించాలని యూపీ సర్కార్‌ భావిస్తోంది. ఇందులో భాగంగానే రామ మందిర సముదాయాన్ని పూలు, విద్యుత్‌ దీపాలతో సుందరంగా అలంకరిస్తున్నారు. బుధవారం సాయంత్రం 6:30 గంటలకు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌.. సరయూ హారతి (Saryu Aarti) ఇస్తారు. అనంతరం నది ఒడ్డున దీపోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమాన్ని మొత్తం డ్రోన్‌ కెమెరాలతో చిత్రీకరిస్తూ దీపాలను లెక్కించనున్నారు. ఈ దీపోత్సవానికి అన్ని శాఖల మంత్రులు, ప్రభుత్వ అధికారులు హాజరుకానున్నారు. కార్యక్రమం అనంతరం లేజర్‌ షో ఏర్పాటు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read