టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. అలనాటి తార నటి కృష్ణవేణి (102) కన్నుమూసింది. వయసు రీత్య అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆదివారం ఫిల్మ్‌నగర్‌లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. కృష్ణవేణి మరణవార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ఆమెకి నివాళులు ఆర్పిస్తున్నారు. కృష్ణవేణి విషయానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రికి చెందిన కృష్ణవేణి సినిమాలలోకి రాక ముందు రంగస్థల నటిగా పనిచేసింది. 1936లో సతీఅనసూయ చిత్రంతో బాలనటిగా సినీ రంగప్రవేశం చేసింది. ఆ తరువాత కథానాయకిగా తెలుగులో 15 చిత్రాలలో నటించింది. కొన్ని తమిళ, కన్నడ భాషా చిత్రాలలో కూడా కథానాయకిగా నటించింది.
1949 తెలుగులో సినిమా చరిత్రలో మైలురాయి అయినటువంటి మన దేశం చిత్రాన్ని నిర్మించి అందులో తెలుగు తెరకు దివంగత నటుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీనియర్ ఎన్టీఆర్‌ని, యస్వీ రంగారావును, నేపథ్యగాయకునిగా ఘంటసాల వెంకటేశ్వరరావును పరిచయం చేసింది. ఆ తరువాత సినిమాలలో అనేక గాయకులు నటులు, సంగీత దర్శకులను పరిచయం చేసింది.కృష్ణవేణి నటించిన సినిమాలలో సతీ అనసూయ -ధ్రువ (1935), మోహినీ రుక్మాంగద (1937), కచ దేవయాని (1938), మళ్ళీ పెళ్ళి (1939), మహానంద (1939), జీవనజ్యోతి (1940), దక్షయజ్ఞం (1941), భీష్మ (1944), బ్రహ్మరథం (1947), మదాలస (1948), మన దేశం (1949), గొల్లభామ (1947), లక్ష్మమ్మ (1950) మంచి గుర్తింపు తెచ్చి పెట్టాయి. ఇక కృష్ణవేణి అందించిన సేవలకు గాను తెలుగు సినిమా పరిశ్రమ 2004లో ప్రతిష్ఠాత్మక రఘుపతి వెంకయ్య అవార్డుతో సత్కరించింది.