ఆంధ్రప్రదేశ్‌లో ఫిబ్రవరి ఒకటో తేదీ నుండి కొత్త రిజిస్ట్రేషన్ విలువలు అమల్లోకి వస్తాయని, దీనికి సంబంధించి ఇప్పటికే సుదీర్ఘ కసరత్తు చేశామని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ర్టేషన్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. అయితే రాజధాని గ్రామాల్లో మాత్రం రిజిస్ట్రేషన్ విలువల్లో ఎటువంటి మార్పు ఉండదని చెప్పారు.ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ .. రాష్ట్రంలో గ్రోత్ సెంటర్లుగా ఉండి, మార్కెట్ విలువ 10 రెట్లు అదనంగా ఉన్న ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ విలువలు పెరుగుతాయన్నారు. కొన్ని ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ విలువలు అక్కడి మార్కెట్ విలువల కన్నా ఎక్కువగా ఉన్నాయని ఆ ప్రాంతాల్లో విలువలు తగ్గుతాయని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ఎమ్మార్వోలను అడ్డం పెట్టుకొని పెద్ద ఎత్తున భూ అక్రమాలకు పాల్పడ్డారని, అలా పేదల భూములను అక్రమ పద్ధతుల్లో వశం చేసుకున్న వారందరినీ వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. నేరం రుజువైన అధికారులపైన కఠిన చర్యలు కచ్చితంగా తీసుకుంటామని తెలిపారు. భూ వివాదాలకు సంబంధించి సమగ్రంగా అధ్యయనం చేసేందుకు 22ఏ భూములు, 596 జీవోలతో పాటు మరో నాలుగు అంశాలపై కలెక్టర్లతో కమిటీలను నియమించనున్నట్లు చెప్పారు.