HomePoliticalఇండియాని ఫాలో అవ్వండి..అమెరిక‌న్ ఇన్ స్టా పోస్ట్

ఇండియాని ఫాలో అవ్వండి..అమెరిక‌న్ ఇన్ స్టా పోస్ట్

అమెరికా అంటే భూతల స్వర్గమని చాలామంది భారతీయుల నమ్మకం.. ఆ దేశంలో సెటిల్ కావాలనేది చాలామంది కల. అక్కడ లేని సౌకర్యమంటూ లేదని, పౌరులు సుఖంగా జీవిస్తున్నారని భావిస్తుంటారు. అయితే, అగ్రరాజ్యంలో లేని చాలా సదుపాయాలు మన భారతదేశంలోనే ఉన్నాయని, ఇక్కడున్న సదుపాయాలు అమెరికాలోనూ ఉండి ఉంటే ఎంత బావుండేదోనని ఓ యువతి చెబుతోంది. అమెరికా సిటిజన్ అయిన సదరు యువతి ప్రస్తుతం భారత్ లో పర్యటిస్తోంది. మన దేశానికే ప్రత్యేకమైన పది సౌకర్యాలను ప్రస్తావిస్తూ అమెరికాకు ఈ సదుపాయాలు అవసరమని చెప్పింది. ఈమేరకు ఇన్ స్టాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ పోస్టులో ఏముందంటే..

నరేంద్ర మోదీ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థ అమెరికాకు ఎంతో అవసరమని యూఎస్ సిటిజన్ క్రిస్టెన్ ఫిషర్ చెప్పారు. డిజిటల్ ఐడీ, యూపీఐ వ్యవస్థలతో నగదు వెంట తీసుకెళ్లే ఇబ్బంది తప్పిందని, భారతీయులకు ఇది మంచి సదుపాయమని వివరించారు. చేతిలో ఫోన్ ఉంటే చాలు మొత్తం బ్యాంకింగ్ వ్యవహారాలన్నీ చక్కబెట్టుకోవచ్చని అన్నారు. ఒక్క అమెరికా మాత్రమే కాదు, మొత్తం ప్రపంచం ఈ విధానాన్ని అమలు చేయాలని అభిప్రాయపడ్డారు. మన దేశంలోని పట్టణాలలో అడుగడుగునా కనిపించే ఆటోలు అమెరికాలోనూ ఉంటే ఎంచక్కా తక్కువ ఖర్చుతో వేగంగా ప్రయాణం చేసే వీలుండేదని ఫిషర్ చెప్పుకొచ్చారు. అనారోగ్యానికి గురైతే ఎలాంటి అపాయింట్ మెంట్ లేకుండా నేరుగా వైద్యుడిని కలిసే అవకాశం ఇండియాకు మాత్రమే సొంతమని, అమెరికాలో డాక్టర్ ను కలుసుకోవాలంటే కనీసం వారం ముందు అపాయింట్ మెంట్ బుక్ చేసుకోవాలని, ఒక్కోసారి డాక్టర్ అపాయింట్ మెంట్ కోసం నెలల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఉందని చెప్పారు. ముందస్తు అపాయింట్ మెంట్ లేకుండా వైద్యుడిని కలవడం దాదాపుగా అసాధ్యమని చెప్పుకొచ్చారు.

రోజూ ఇంట్లో తయారయ్యే చెత్తను మునిసిపాలిటీ సిబ్బంది ఉచితంగా తీసుకెళ్లే వ్యవస్థ ఢిల్లీలో ఉందని, ఇది అమెరికాకు కూడా అవసరమని ఫిషర్ చెప్పారు. భారత్ లో తక్కువ ఖర్చుతో నైపుణ్యం ఉన్న సిబ్బందిని నియమించుకోవచ్చని తెలిపారు. అదే అమెరికాలో సిబ్బందిని నియమించుకోవడం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని, అందుకే చాలా పనులు ఎవరికి వారే నేర్చుకుని చేసుకుంటారని వివరించారు. భారత్ లోని వివిధ రెస్టారెంట్లలో లభించే శాకాహార వెరైటీలు అమెరికాలో కనిపించవని, ఇండియాలో తనకెంతో నచ్చిన విషయం ఇదేనని ఫిషర్ తెలిపారు. అమెరికన్లు రోజూ అందుకునే జంక్ మెయిల్ ఇబ్బంది భారతీయులకు లేదన్నారు.

డాక్టర్ ప్రిస్కిప్షన్ తో అవసరం లేకుండా చిన్నచిన్న అనారోగ్యాలకు మెడికల్ షాపుల్లో మందులు కొనుగోలు చేసే సదుపాయం అమెరికాలోనూ అందుబాటులోకి వస్తే బాగుంటుందని చెప్పారు. భారత్ లో ఏ వస్తువులపై ముద్రించే ఎంఆర్పీ చూసి వాటిని కొనుగోలు చేయొచ్చని, దేశంలోని ఏ ప్రాంతానికి వెళ్లినా ఆ వస్తువు ధర అంతే ఉంటుందన ఫిషర్ తెలిపారు. అమెరికాలో అమ్మేవాడి దయ మన ప్రాప్తం అన్నట్లు ఉంటుందని చెప్పారు. చివరగా భారత దేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న డెలివరీ యాప్ లు అమెరికాకు ఎంతో అవసరమని, తినే ఆహారం నుంచి చిన్నా పెద్ద వస్తువుల వరకు ఈ యాప్ ల సాయంతో తెప్పించుకోవచ్చని క్రిస్టన్ ఫిషర్ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read