HomeEntertainmentవ్యక్తిగత విషయాల్లోనూ అంతే: అనుపమ పరమేశ్వరన్

వ్యక్తిగత విషయాల్లోనూ అంతే: అనుపమ పరమేశ్వరన్

కమర్షియల్ సినిమాలలో ఎన్ని తప్పులు ఉన్నా ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోరని, కానీ తమలాంటి వాళ్లు చేసిన ప్రయోగాత్మక, నాయికా ప్రాధాన్య చిత్రాలలో మాత్రం తప్పులు వెతుకుతున్నారని నటి అనుపమ పరమేశ్వరన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల విడుదలైన ‘పరదా’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందనపై చిత్రబృందం సోమవారం హైదరాబాద్‌లో థాంక్స్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా అనుపమ తన అభిప్రాయాలను పంచుకున్నారు. కొంతమంది వినోదాత్మక చిత్రాలను ఇష్టపడితే, మరికొందరు కథాబలం ఉన్న సినిమాలను ఆదరిస్తారని అనుపమ తెలిపారు. ‘పరదా’ చిత్రాన్ని తాను ఎంతో ఇష్టపడి చేశానని, అయితే కొందరు దీనిని ప్రయోగాత్మక చిత్రం అని చెబుతూనే అందులో లోపాలను వెతకడంపై దృష్టి పెడుతున్నారని ఆమె అన్నారు. “కమర్షియల్ చిత్రాల్లో వెయ్యి తప్పులున్నా ఎవరూ ప్రశ్నించరు. కానీ లేడీ ఓరియెంటెడ్ సినిమాల విషయానికి వచ్చేసరికి విమర్శలు ఎక్కువగా ఉంటాయి. సినిమా పరంగానే కాకుండా వ్యక్తిగత జీవితం విషయంలోనూ ఇలాంటి ధోరణులే కనిపిస్తుంటాయి. కొత్తగా ఏదైనా ప్రయత్నిస్తే సగం మంది విమర్శిస్తుంటారు. మేం పడిన కష్టాన్ని గుర్తిస్తే ఇలాంటి కొత్త కథలకు మరింత ప్రోత్సాహం లభిస్తుంది” అని ఆమె విజ్ఞప్తి చేశారు.


ఈ కార్యక్రమంలో దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల భావోద్వేగానికి గురయ్యారు. తెలుగు ప్రేక్షకులు మంచి కథలను ఆదరిస్తారనే నమ్మకంతోనే ఈ సినిమా తీశామని, కానీ కొందరు మంచి కంటెంట్‌ను విస్మరించి తప్పులు వెతకడంపైనే దృష్టి సారిస్తున్నారని ఆయన అన్నారు. “సినిమా విడుదలై కొద్ది రోజులే అయింది, అప్పుడే విమర్శించడం సరికాదు. ఇలాంటి కాన్సెప్ట్ తెలుగులో ఇంతకుముందెన్నడూ రాలేదు. ముఖం కనిపించని పాత్రలో నటించేందుకు ఒప్పుకున్న అనుపమ ధైర్యం గొప్పది. ఆమెకు ఈ సినిమాతో జాతీయ అవార్డు రావాలి” అని ప్రవీణ్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నటుడు రాగ్ మయూర్ కూడా పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read