అమరావతి: విజయవాడలోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ తో 2025 మార్చి 31 నాటికి లక్ష సీసీ కెమెరాలు అనుసంధానిస్తామని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో ఇప్పటికే 25 వేలకు పైగా సీసీ కెమెరాలను నేర నియంత్రణకు వినియోగిస్తున్నామన్నారు. గతంతో పోలిస్తే సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయన్నారు. ఈ ఏడాదిలో సైబర్ క్రైమ్ కు సంబంధించి 916 కేసులు నమోదు కాగా.. సుమారు రూ.1,229 కోట్ల మేర నగదును సైబర్ నేరగాళ్లు కాజేశారని పేర్కొన్నారు. డిజిటల్ అరెస్టు అనేది లేదని.. అలాంటి కాల్స్ ను ప్రజలు నమ్మొద్దన్నారు.
“కొత్తగా ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నాం. స్మార్ట్ పోలీసింగ్‌లో భాగంగా దేశంలోనే తొలిసారి ఏపీలో ‘స్మార్ట్ పోలీస్ ఏఐ’ వ్యవస్థను వినియోగిస్తున్నాం. ప్రస్తుతం ఏలూరు జిల్లా పోలీసులు ఈ స్మార్ట్ పోలీస్ ఏఐను అమలు చేస్తున్నారు. కేసు నమోదు నుంచి విచారణ వరకూ ఈ స్మార్ట్ పోలీస్ ఏఐ విచారణాధికారికి సహకరిస్తుంది. ట్రాఫిక్, క్రౌడ్ మేనేజ్మెంట్ కోసం విజయవాడ పోలీసులు ‘ఏఐ వజ్రాస్త్రం’ పేరిట ఏఐ సాంకేతికత వినియోగిస్తున్నారు” అని డీజీపీ తెలిపారు.