అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ లు ఎట్టకేలకు భూమికి తిరిగి రానున్నారు. వారిని తీసుకొచ్చేందుకు వెళ్లిన క్రూ 10 షిప్ ఆదివారం ఉదయం 9:37 గంటలకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)తో విజయవంతంగా అనుసంధానమైంది. క్రూ 10 లో వెళ్లిన నలుగురు వ్యోమగాములకు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ లు స్వాగతం పలికారు. వీరిద్దరి స్థానంలో ప్రస్తుతం వెళ్లిన నలుగురు వ్యోమగాములు ఐఎస్ఎస్ లో పనిచేయనున్నారు. క్రూ 10 మిషన్ లో సునీత, బుచ్ లు భూమికి తిరిగి రానున్నారు. ఈ నెల 19న వారు భూమిపై ల్యాండవుతారని అనధికారిక సమాచారం.2024 జూన్ 5న ‘స్టార్‌లైనర్’ వ్యోమనౌకలో సునీత, బుచ్ విల్మోర్ లు ఐఎస్ఎస్ కు చేరుకున్నారు. వారం రోజుల పరిశోధనల కోసం వెళ్లిన వారిద్దరూ స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యల కారణంగా అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. వారిని అక్కడే వదిలేసి స్టార్‌లైనర్ భూమిని చేరుకుంది.