HomeEntertainmentసైఫ్ పై దాడి చేసింది నేనే..

సైఫ్ పై దాడి చేసింది నేనే..

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడిచేసింది తానేనని బంగ్లాదేశ్‌కు చెందిన నిందితుడు అంగీకరించాడు. దుండగుడు మహమ్మద్ షరీఫుల్ ఇస్లామ్ షెహజాద్‌ను నిన్న థానే, కాసరవడవలిలోని హీరానందానీ ఎస్టేట్ సమీపంలో పోలీసులు అరెస్ట్ చేశారు. సైఫ్‌పై దాడి జరిగిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు 70 గంటలకుపైగా గాలించి నిందితుడికి అరదండాలు వేశారు. అనంతరం సీనియర్ పోలీసు అధికారి ఒకరు నిందితుడిని ప్రశ్నిస్తూ.. సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసింది ఎవరని అడిగారు. అందుకు అతడు ‘హా మైనే హీ కియా హై’ (అవును, నేనే చేశాను) అని బదులిచ్చాడు.

లేబర్ కాంట్రాక్టర్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు నిందితుడిని ట్రేస్ చేసి పట్టుకున్నారు. అతడి గురించి పక్కా సమాచారం అందుకున్న పోలీసులు దాదాపు 100 మంది థానే చేరుకుని గాలింపు మొదలుపెట్టారు. దాదాపు ఏడు గంటలపాటు కొనసాగిన సెర్చ్ ఆపరేషన్ తర్వాత అటవీ ప్రాంతంలో దాక్కున్న షెహజాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంగ్లాదేశీయుడైన నిందితుడి వద్ద భారత్‌లో ఉండేందుకు ఎలాంటి పత్రాలు లేవని పోలీసులు తెలిపారు. అతడి వద్ద ఉన్న ఆధారాలను బట్టి అతడు బంగ్లాదేశీయుడని గుర్తించినట్టు పేర్కొన్నారు. నాలుగు నెలలుగా ముంబైలో ఉంటున్న షెహజాద్ తన పేరును బిజోయ్ దాస్‌గా మార్చుకున్నాడు. కాగా, కోర్టు అతడిని ఐదు రోజుల పోలీసు కష్టడీకి అనుమతినిచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img