వయనాడ్ కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం కావడంతోపాటు ..ఇప్పటి వరకు ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాలలో పోటీ చేయకపోవడం ఇక్కడ ఆమెకు ప్లాస్ పాయింట్స్ అని చెప్పాలి. వయనాడ్ లోక్ సభ ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ అద్భుత విజయంపై ఆమె భర్త రాబర్ట్ వాద్రా స్పందించారు. వయనాడ్ ప్రజలు ప్రియాంక కృషిని గుర్తించారన్నారు. అందుకే గెలిపించారని చెబుతూ ఆ నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజల సమస్యలను పార్లమెంట్‌లో వినిపించేందుకు ప్రియాంక శ్రమిస్తారని తెలిపారు.ఇప్పటిదాకా ప్రియాంక గాంధీ పుస్తకాలు చదువుతూ… పిల్లలను చూసుకుంటూ బిజీగా ఉన్నారని వెల్లడించారు. దేశ ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో ఆమె ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారని తెలిపారు. ఇక నుంచి ఆమె ప్రజలకు సేవ చేస్తారన్నారు. కాగా, ప్రియాంక గాంధీ గెలుపును ప్రకటించడానికి ముందు ఆయన స్పందించారు. ఆమె 3.94 లక్షల మెజార్టీతో విజయం సాధించారు.
ప్రజల కోసం తాను శ్రమిస్తూనే ఉంటానని, కాబట్టి పార్లమెంట్‌లో ఉండాల్సిన అవసరం లేదని రాబర్ట్ వాద్రా అన్నారు. ప్రియాంక గాంధీ పార్లమెంట్‌లో తన గళం బలంగా వినిపిస్తారన్నారు. అయితే తనకూ అలాంటి సమయం రావొచ్చని… అంతిమంగా ప్రజలు ఏం కోరుకుంటారో అదే జరుగుతుందన్నారు.మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కూడా రాబర్ట్ వాద్రా స్పందించారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల నుంచి ఎంతో నేర్చుకోవాల్సి ఉందన్నారు. ప్రజల తీర్పును అందరూ గౌరవించాల్సిందేనని వ్యాఖ్యానించారు. గెలిచిన పార్టీతో కలిసి రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. ఝార్ఖండ్ ఫలితాలపై చాలా సంతోషంగా ఉందన్నారు. ఈడీ, ఇతర దర్యాఫ్తు సంస్థలను ఉపయోగించి బీజేపీ ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా అధికార కూటమి పీఠాన్ని కాపాడుకుందన్నారు. ప్రజలు సరైన నిర్ణయం తీసుకున్నారని వ్యాఖ్యానించారు.