తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ ప్రతిపక్షానికి మాత్రమే పరిమితమైంది. అయితే ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయాలనే పట్టుదల ప్రదర్శించారు సీఎం రేవంత్ రెడ్డి అందుకోసం పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. ఇది పెద్ద దుమారమే రేపింది. తమ పార్టీ ఎమ్మెల్యేలను ఎలా లాక్కుంటారని ప్రశ్నించింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాల్సిందిగా స్పీకర్ కు ఫిర్యాదు చేసింది. హైకోర్టును ఆశ్రయించింది. అయితే ఎక్కడా ఆ పార్టీ ఆశించిన ఫలితం రాలేదు. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతోంది బీఆర్ఎస్.
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 39 సీట్లు దక్కాయి. ఆ తర్వాత కంటోన్మెంట్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ఆ పార్టీ ఓడిపోయింది. దీంతో బీఆర్ఎస్ సభ్యుల సంఖ్య 38కి చేరింది. వీళ్లలో 10 మంది కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. దీంతో ప్రస్తుతం బీఆర్ఎస్ కు 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. పార్టీ ఫిరాయించిన ముగ్గురిపై వేటు వేయాలని స్పీకర్ కు విజ్ఞప్తి చేసింది బీఆర్ఎస్. ఖైరతాబాద్, స్టేషన్ ఘన్ పూర్, భద్రాచలం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరింది. అయితే స్పీకర్ పట్టించుకోలేదు.
ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోవాలని.. వాళ్ల శాసన సభ్యత్వం రద్దు చేయాలని బీఆర్ఎస్ ఓ వైపు స్పీకర్ కు విజ్ఞప్తి చేస్తూ ఉండగానే పలువురు ఇతర ఎమ్మెల్యేలు కూడా పార్టీ ఫిరాయించారు. స్పీకర్ స్పందించకపోవడం వల్లే ఇలా జరుగుతోందని బీఆర్ఎస్ భావించింది. ఈ అంశంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పలు విచారణల అనంతరం నాలుగు వారాల్లోపు చర్యలు తీసుకోవాల్సిందిగా స్పీకర్ కార్యాలయాన్ని గతేడాది సెప్టెంబర్ లో ఆదేశించింది హైకోర్టు. అయితే హైకోర్టు ఆదేశాలు ఇచ్చి మూడు నెలలు గడిచినా స్పీకర్ ఇంతవరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకునేటట్లు లేరని భావిస్తున్న బీఆర్ఎస్.. ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకోవాలనుకుంటోంది. అందుకే హైకోర్టు తీర్పు అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ మళ్లీ హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ వేయడం .. లేదంటే సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాల్సిందిగా పిటిషన్ వేయడం.. ఈ రెండింటిలో ఏదో ఒకటి చేయాలనుకుంటోంది. ఈ వ్యవహారంపై ఎలా ముందుకెళ్తే బాగుంటుందో న్యాయ నిపుణులతో సంప్రదిస్తోంది. గతంలో ఫిరాయింపుదారులపై కోర్టులు లేదా స్పీకర్ తీసుకున్న చర్యలు.. ఇతర రాష్ట్రాల్లో ఏం జరిగింది.. లాంటి అంశాలపై పార్టీ న్యాయనిపుణులతో చర్చిస్తోంది. ఢిల్లీకి చెందిన పలువురు సీనియర్ న్యాయవాదులను కూడా సంప్రదిస్తున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ అంశంపై హైకోర్టు లేదా సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.