అబ్బాయిది అమలాపురం..అమ్మాయిది కెనడా..అయితేనేం వారిద్దరూ ప్రేమించుకున్నారు..అంతేనా పెళ్లి కూడా చేసుకున్నారు. 14 ఏళ్ల క్రితం ఉన్నత విద్య కోసం ఏపీలోని అమలాపురం మండలం ఈదరపల్లికి చెందిన మనోజ్ కుమార్ కెనడా వెళ్లాడు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత అక్కడే ఓ బ్యాంకులో ఉద్యోగం సంపాదించాడు. ప్రస్తుతం కెనడాలో బ్యాంకు మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో మనోజ్ కుమార్‌కు కెనడా అమ్మాయి ట్రేసి రోచే డాన్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా తర్వాత ప్రేమగా మారింది. దాంతో గత ఏడేళ్లుగా ఈ జంట ప్రేమలో ఉన్నారు. పెద్దలను ఒప్పించి కెన్యాలో నిశ్చితార్థం చేసుకున్నారు. అనంతరం కెనడా సాంప్రదాయం ప్రకారం వివాహబంధంతో ఒక్కటయ్యారు. హిందూ సాంప్రదాయంలో పెళ్లి చేసుకోవాలని ఈ జంట ఈదరపల్లిలోని స్వగృహానికి వచ్చింది. తాజాగా వీరి హల్దీ ఫంక్షన్ ఘనంగా జరిగింది. ఈ వారంలో మలికిపురం మండలం దిండిలో హిందూ సాంప్రదాయం ప్రకారం తాము పెళ్లి చేసుకుని, ఆపై రిసెప్షన్ నిర్వహిస్తామని మనోజ్ కుమార్ తెలిపాడు.