అంతరిక్ష పరిశోధనల్లో అమెరికాను చైనా అధిగమించింది. తాజాగా డ్రాగన్ వ్యోమగాములు కై షూఝె, సాంగ్ లింగ్‌డాంగ్‌లు 9 గంటలపాటు సుదీర్ఘంగా స్పేస్ వాక్ చేసి చరిత్ర సృష్టించారు. వీరు షెంఝూ-19 అనే అంతరిక్ష నౌకా బృందంలో సభ్యులు. వీరు చైనాలో తయారు చేసిన ఫెయిటియాన్ రెండోతరం స్పేస్ సూట్లను ధరించారు. ఈ విషయాన్ని చైనా మ్యాన్‌డు స్పేస్ ఏజెన్సీ (సీఎంఎస్ఏ) వెల్లడించింది. చైనాకు చెందిన తియాంగాంగ్ స్పేస్ సెంటర్ రోబోటిక్ కెమెరా దీనిని చిత్రీకరించి బీజీంగ్ ఏరోస్పేస్ కంట్రోల్ సెంటర్‌కు పంపింది. సాంగ్ లింగ్‌డాంగ్ మాజీ ఫైటర్ పైలట్. చైనాలో 1990ల తర్వాత పుట్టిన వారిలో స్పేస్ వాక్ చేసిన తొలి వ్యక్తిగా నిలిచారు. కై షూఝెకు అంతరిక్షంలో నడవడం ఇది రెండోసారి. 2022 నవంబర్‌లో 5.5 గంటలు ఈ ఫీట్‌ను చేశారు.
వీరిద్దరూ అక్టోబర్ చివర్లో తియాంగాంగ్ స్పేస్ స్టేషన్‌కు చేరుకొన్నారు. ఏప్రిల్ 2025 వరకు అక్కడే ఉండొచ్చు. చైనా వ్యోమగాములు తొలిసారి 2008లో 20 నిమిషాలపాటు స్పేస్‌వాక్ చేశారు. గతంలో చైనాకు చెందిన షెంఝూ-18 మిషన్‌లో యె గాంగ్‌ఫూ, లిగువాంగ్‌సులు 8.23 గంటలు స్పేస్ వాక్ చేశారు. ఇప్పుడు దానిని కూడా అధిగమించారు. 2001 మార్చి 12 తేదీన అమెరికా వ్యోమగాములు జేమ్స్ వూస్, సుసాన్ హల్మ్సెలు 8.56 గంటలు స్పేస్ వాక్ చేయగా.. తాజాగా దీనిని చైనా వ్యోమగాములు అధిగమించారు. నాడు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం మిషన్‌లో భాగంగా వీరు స్పేస్ షటిల్ డిస్కవరీ బయట దీనిని నిర్వహించారు.