ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళి విడుదల నిలిచిపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్, వారి కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్ట్ అయిన పోసానికి నిన్న కర్నూలు కోర్టు బెయిలు మంజూరు చేసింది. రూ. 20 వేల పూచీకత్తు, ఇద్దరు జామీనుతో కోర్టు బెయిలు ఇచ్చింది. అంతకుముందు రోజే నరసరావుపేట జిల్లా కోర్టు కూడా బెయిలు ఇవ్వడంతో నేడు ఆయన జైలు నుంచి విడుదలవుతారని అందరూ భావించారు. అనూహ్యంగా ఆయన విడుదల నిలిచిపోయింది. పోసానిపై సీఐడీ పోలీసులు పీటీ వారెంట్ వేశారు. ఆయన కోసం గుంటూరు సీఐడీ పోలీసులు కర్నూలు జిల్లా జైలు వద్దకు వెళ్లారు. పీటీ వారెంట్‌పై పోసానిని జైలు నుంచే వర్చువల్‌గా జడ్జి ఎదుట ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన విడుదల అకస్మాత్తుగా నిలిచిపోయింది.