అగ్ర కథానాయకుడు నాని నిర్మాణంలో వస్తున్న తాజా చిత్రం ‘కోర్ట్: స్టేట్ వర్సెస్ ఎ నోబడీ . ఈ సినిమాకు రామ్ జగదీశ్ దర్శకత్వం వహిస్తుండగా.. హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటిస్తున్నారు. ప్రియదర్శి, శివాజీ, సాయికుమార్, రోహిణి, హర్ష వర్ధన్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. యదార్థ సంఘటనల ఆధారంగా రాబోతున్న ఈ చిత్రం మార్చి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మూవీ ట్రైలర్‌తో పాటు ప్రీ రిలీజ్ వేడుకను చిత్రబృందం నిర్వహించింది. ఇక ఈ వేడుకకు నానితో పాటు దర్శకుడు ప్రశాంత్ వర్మ, శ్రీకాంత్ ఓదెలా, మోహనకృష్ణ ఇంద్రగంటి, నాగ్ అశ్విన్ తదితరులు వచ్చి చిత్రబృందానికి విషెస్ తెలిపారు.
ఈ వేడుకలో నాని మాట్లాడుతూ.. 14వ తేదీ కోర్ట్ సినిమా రాబోతుంది. ఈ సినిమా మీరు మిస్ అవ్వోద్దని నేను కోరుకుంటున్నాను. నా 16 ఏండ్ల కెరీర్‌లో ఎప్పుడు ఒక వేదికపైకి వచ్చి దయచేసి సినిమాకి వెళ్లండని అడుగలేదు. కానీ, ఈ చిత్ర విషయంలో ఆ మాట అడుగుతున్నా. ఎందుకంటే ఈ సినిమాను మీరు మిస్ అవ్వకుడదు. మీ ఫ్యామిలీతో, మీ ఫ్రెండ్స్‌తో మీకు నచ్చిన వారితో సినిమాకి వెళ్లండి. నిర్మాత కదా ఇలానే చెబుతాడు అనుకోవద్దు. మీకు నమ్మకం రావడానికి ఒక విషయం చెబుతాను. మరో రెండు నెలల్లో నా హిట్ 3 సినిమా రిలీజ్ కాబోతుంది. మార్చి 14కి మీరు కోర్ట్ సినిమాకి వెళ్లి అది నచ్చకుంటే నా హిట్ సినిమాకి ఎవరు రాకండి. ఇంతకంటే బలంగా నేనేమీ చెప్పలేను. ఎందుకంటే దీనికన్నా 10రెట్లు ఎక్కువగా ‘హిట్ 3’పై ఖర్చు పెట్టా. అందుకే 14న వెళ్లి సినిమాను చూడండి. చాలా రోజుల తర్వాత ఒక మంచి తెలుగు సినిమాను చూసి బయటకు వస్తారంటూ నాని చెప్పుకోచ్చాడు.