మధుమేహం (డయాబెటిస్) వల్ల గుండె జబ్బులు, మరణాల ముప్పు పెరుగుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ప్రమాదం తీవ్రత ఆడవారిలో, మగవారిలో ఒకేలా ఉండదని, డయాబెటిస్ రకాన్ని బట్టి ఇది పూర్తిగా మారిపోతుందని ఓ కొత్త అధ్యయనం తేల్చి చెప్పింది. ముఖ్యంగా యువకుల్లో టైప్ 2 డయాబెటిస్ అత్యంత ప్రమాదకరంగా పరిణమిస్తుండగా, మహిళల్లో మాత్రం టైప్ 1 డయాబెటిస్ ప్రాణాంతకంగా మారుతోందని ఈ పరిశోధన స్పష్టం చేసింది. స్వీడన్లోని ఉప్సాలా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు సుమారు 4 లక్షల మంది డయాబెటిస్ రోగుల డేటాను విశ్లేషించి ఈ కీలక విషయాలను వెలుగులోకి తెచ్చారు. ఈ అధ్యయనం ప్రకారం, 50 ఏళ్లలోపు వయసున్న టైప్ 2 డయాబెటిస్ బాధితులైన పురుషుల్లో గుండె సంబంధిత వ్యాధులు, గుండెపోటు, హృదయ వైఫల్యం వంటి సమస్యలు టైప్ 1 డయాబెటిస్ ఉన్న పురుషుల కంటే చాలా ఎక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు. టైప్ 1 తో పోలిస్తే, టైప్ 2 డయాబెటిస్ ఉన్న యువకుల్లో గుండె జబ్బుల ప్రమాదం 51 శాతం అధికంగా ఉండగా, గుండెపోటు ముప్పు 2.4 రెట్లు, హృదయ వైఫల్యం ముప్పు 2.2 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు.
అయితే మహిళల విషయంలో పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా ఉంది. అన్ని వయసుల మహిళల్లోనూ టైప్ 2 డయాబెటిస్తో పోలిస్తే టైప్ 1 డయాబెటిస్తోనే మరణాల ముప్పు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ముఖ్యంగా గుండె జబ్బుల కారణంగా సంభవించే మరణాల రేటు టైప్ 2 ఉన్న మహిళలతో పోలిస్తే టైప్ 1 ఉన్న మహిళల్లో 34 శాతం అధికంగా ఉందని, ఇతర కారణాలతో సంభవించే మరణాల రేటు కూడా 19 శాతం ఎక్కువని పరిశోధకులు తెలిపారు.ఈ వ్యత్యాసానికి గల కారణాలను అధ్యయన బృందంలోని డాక్టర్ వాగియా పట్సౌకాకి వివరించారు. “మహిళలు సాధారణంగా చిన్న వయసులోనే టైప్ 1 డయాబెటిస్ బారిన పడతారు. గుండె, రక్తనాళాల సమస్యల ముప్పు జీవితకాలం పెరుగుతుంది. అంతేకాక, గుండె జబ్బుల నుంచి మహిళలకు సహజంగా లభించే రక్షణ కూడా తగ్గిపోతుంది” అని ఆమె అన్నారు.