దీపావళి వేడుకలు ప్రారంభమయ్యాయి..నరక చతుర్దశి నుంచే బాణసంచా పేలుస్తూ చిన్నాపెద్ద సంబరాలు చేసుకుంటున్నారు. ఇళ్లను దీపాలతో అలంకరించుకుని పండుగ చేసుకుంటున్నారు. దేశ ప్రజలందరూ ఇళ్లలో దీపావళి చేసుకుంటుంటే కరీంనగర్‌లోని ఓ ప్రాంతవాసులు మాత్రం అందుకు భిన్నంగా పండుగ చేసుకుంటారు. అది వారి సంప్రదాయం కూడా. నగరంలోని కార్ఖానా గడ్డలో నివాసం ఉండే కొన్ని దళిత కుటుంబాలు ప్రతి సంవత్సరం శ్మశాన వాటికలో దీపావళి జరుపుకొంటాయి. తమ పెద్దలను గుర్తుచేసుకుంటూ సమాధుల మధ్య వారు పండుగ చేసుకుంటారు. ఇందులో భాగంగా తొలుత సమాధులను శుభ్రం చేసి పూలతో అలంకరిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి సాయంత్రం శ్మశాన వాటికకు చేరుకుని అక్కడ టపాసులు కాల్చి పండుగ జరుపుకొంటారు. కొన్ని దశాబ్దాలుగా ఈ సంప్రదాయం కొనసాగుతున్నట్టు దళిత కుటుంబాలు తెలిపాయి.