దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ వాహన ధరలను పెంచనుంది. ఈమేరకు కంపెనీ ఎక్స్‌ఛేంజీ ఫైలింగ్ వెల్లడించింది. జనవరి 2025 నుంచి ఈ పెంపు అమల్లోకి రానుంది. ఈ పెంపు కారు మోడల్, వేరియంట్ ఆధారంగా అత్యధికంగా 4శాతం వరకు ఉండొచ్చని అంచనా. ‘‘వ్యయాలను నియంత్రించి వినియోగదారులపై భారం తగ్గించడానికి కంపెనీ నిరంతరం ప్రయత్నిస్తోంది. కానీ, కొన్ని భాగాల్లో ధరల పెరుగుదలను మార్కెట్ పైకి బదలాయించక తప్పడం లేదు’’ అని ఫైలింగ్‌లో కంపెనీ వెల్లడించింది.
మరోవైపు ప్రధాన పోటీదారు అయిన హ్యుందాయ్ మోటార్స్ కూడా నిన్ననే కార్ల ధరల పెంపును ప్రకటించిన విషయం తెలిసిందే. జనవరి 1 నుంచి తమ వాహన మోడళ్లపై కొంత మొత్తం పెంచుతున్నట్లు వెల్లడించింది. ముడిసరుకులు, ఇతర వ్యయాలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినట్లు పేర్కొంది. ప్రస్తుతం గ్రాండ్ ఐ10 నియోస్ నుంచి అయానిక్ వరకు ఈ సంస్థ వాహనాల ధరల శ్రేణి రూ.5.92 లక్షల నుంచి రూ.46.05 లక్షల వరకు ఉంది. మరోవైపు మహీంద్రా కూడా తన స్కార్పియో ఎన్ మోడల్‌పై వేరియంట్లను బట్టి రూ.25 వేల వరకు ధర పెంచింది. దీంతోపాటు ఎక్స్‌యూవీ 300 రేట్లను కూడా పెంచింది. నిస్సాన్, ఆడి, బీఎండబ్ల్యూ, బెంజ్ సంస్థలు కూడా ఈ బాటలోనే పయనించాయి.