నిత్యావసరాలు..కూరగాయలు. అల్పాహారాలు … భోజనాలు.. ఒకటేమిటి.. తినే తిండి దగ్గర నుంచి ధరించే దుస్తులు.. నగలు… ప్రయాణాలు.. విదేశాలు.. వినోదాలు.. ఒకటేంటి సాంకేతికతతో అన్ని సదుపాయాలు ఇంటి ముంగిట్లోకి వచ్చేస్తున్నాయి. ఆండ్రాయిత్ ఫోన్‌తో ఛాటింగ్‌లు.. వాట్సాఫ్ మెసేజ్‌లు… ట్విట్టర్‌లో వీడియోలు.. ఇన్‌స్టాలో అప్‌డేట్లు… ప్రతిదీ క్షణాల్లో ఆప్తులకు మెసేజ్‌లు ఫొటోల రూపంలో వెళ్లిపోతున్నాయి. ఇదే సామాజిక మాధ్యమాల్లో ఉన్న గమ్మత్తు. నలుగురిలో నటించటానికి భయపడే వారు సైతం ఇంట్లో తమంతటగా తామే వీడియోలు చేసి పోస్టులు చేసేస్తున్నారు. స్టేటస్‌లు పెట్టేస్తున్నారు. వీక్షకులు ఇచ్చే లైక్‌లు, పంపే సందేశాలతో మురిసిపోతూ మరింత లేటెస్ట్ వెర్షన్లలో అభినయిస్తూ దూసుకుపోతున్నారు. గూగుల్‌తో ప్రపంచమే ఓ కుగ్రామంగా మారిపోయింది.
ఆధునిక మానవుడి జీవితంలో దిన చర్య సామాజిక మాధ్యమాలతోనే మొదలవుతోంది. ప్రపంచంలోని వివిధ తరగతుల ప్రజలకు చేరువై… వారితో సంభాషిస్తున్నారు. భిన్న సంస్కృతులు, ప్రముఖ వ్యక్తులు, ఉద్యమాలు ఇలా ప్రపంచంలో ఏ మారుమూల ప్రాంతంలో ఏమి జరిగినా క్షణాల్లో తెలుసుకోగలుగుతున్నాం. ప్రస్తుతం ఫేస్‌బుక్, ఇన్‌స్టా, ట్విటర్, స్నాప్‌చాట్, లింక్డ్ ఇన్ వంటి సామాజిక మాధ్యమాలను విరివిగా వాడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్లు తమ వృత్తి, వ్యక్తిగత అవసరాల నిమిత్తం రోజులో సగటున 144 నిముషాలు ఈ మాధ్యమంలో గడుపుతున్నట్లుగా అంచనా. ప్రపంచవ్యాప్తంగా 4.48 బిలియన్ల ప్రజలు వీటిని వినియోగిస్తున్నారు. ఒక్కొక్కరూ సగటున 6.6 వేర్వేరు మాధ్యమాలను వినియోగిస్తున్నారు. 99 శాతం మంది తమ మొబైల్, 1.32 శాతం మంది కంప్యూటర్‌ను వాడుతున్నారు. మొదట్లో సిక్స్ డిగ్రీస్, ఆ తర్వాత ఫ్రెండ్‌స్టర్, లింక్డ్ఇన్, ఫేస్‌బుక్, మైస్పేస్, యూట్యూబ్, ట్విట్టర్, ఇన్‌స్టా, వాట్సాఫ్ ఆ తర్వాత ప్రాధాన్యతాక్రమంలో దూసుకొచ్చాయి. స్నాప్‌చాట్, టిక్‌టాక్ కూడా కొన్నాళ్లు బాగా ఆకట్టుకున్నాయి.
టాలెంట్ ప్రదర్శిద్దాం గురూ….
ప్రతిభ ఏ ఒక్కరి సొత్తూ కాదు. ఎవరి టాలెంట్ వారిది. ఆటలు ఆడటం, పాటలు పాడటం, నాట్యం చేయటం, డ్యాన్సు చేయడం, నటనాకౌశలం ప్రదర్శించటం స్టేజీ, డ్రామా, సినిమా వేదికలపై గతంలో ప్రదర్శించి ప్రశంసలు పొందేవారు. సోషల్ మీడియా వేదికగా ఎవ్వరైనా, ఎప్పుడైనా తమ ఇష్టానుసారంగా ప్రతిభను ప్రదర్శించే అవకాశాలున్నాయి. ఫేస్‌బుక్‌లో వీడియోలు, ఇన్‌స్టాలో రీల్స్ ఇప్పుడు హోరెత్తిస్తున్నాయి. గతంలో ఎంఓజి, ఎంఎక్స్ టాకా టక్, యూట్యూబ్ షాట్స్, రోపోసో, స్నాప్ ఛాట్, జిపి, షేర్ ఛాట్ వంటివి గతంలో కొంత ప్రజా దరణ పొందాయి. ఎలాంటి ఖర్చు లేకుండా యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకుంటే సరిపోయేది. ఇప్పుడు ఫేస్‌బుక్, ఇన్‌స్టా ఖాతాలతో ప్రతిఒక్కరూ తమ టాలెంట్‌ను రీల్స్, వీడియోల రూపంలో అప్‌లోడ్ చేస్తున్నారు. సినిమాల్లోని పాపులర్ పాటలు, కొన్ని సన్నివేశాలు, రాజకీయనాయకుల ప్రసంగాలు, స్కిట్స్, వార్షికోత్సవ వేడుకలు, సమ్మేళనాలు, సదస్సులు, సమావేశాలు, పండుగలు, ఇలా కార్యక్రమం ఏదైనా అందులో సరికొత్తగా నర్తిస్తూ వీడియోలు, రీల్స్ చేస్తున్నారు.
కుటుంబ సభ్యులు, స్నేహితులు
భార్యాభర్తలు కలిసి కామెడీలు, అత్తాకోడళ్లు, తల్లీకుతూళ్లతో సందేశాత్మక విషయాలు వీడియోలు చేసేస్తున్నారు. కాలేజీ పిల్లలు స్నేహితులతోనూ, టీచర్లు పిల్లలతోనూ డ్యాన్సుల చేస్తూ సందడి చేసేస్తున్నారు. హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ సినీ పరిశ్రమల్లోని అన్ని విభాగాల వారు వీడియోల ద్వారా తమ రోజువారీ వ్యక్తిగత జీవిత విషయాలను అప్‌డేట్ చేస్తున్నారు. ఆరు నెలల పసిగుడ్డు నుంచి వృద్ధుల వరకూ వినోదాత్మకంగానూ, కాలక్షేపం కోసం ఈ మాధ్యమాల్లో గడుపుతున్నారు. చలాకీగా ఆడుకునే పిల్లలు సైతం ఫోన్లలో ఆటలాడుతూ ఊబకాయాన్ని పెంచేసుకుంటున్నారు.
సరికొత్తగా….
శ్రీకాకుళానికి చెందిన ఓ యువకుడు రూ.400లతో ఫోన్‌లో తీసిన షార్ట్‌ఫిల్మ్ ఏకంగా అంతర్జాతీయ బరి వరకూ వెళ్లింది. ఉయ్యూరుకు చెందిన షేక్ అఫ్జల్ కాలేజీ ప్రాజెక్టు వర్కుకోసం కేవలం మూడు గంటల్లో తీసిని ‘శీతాకాలం ప్రేమలు’ అనే షార్ట్ ఫిల్మ్ విశాఖలోని ఆంధ్రా యూనివర్శిటీలో జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ లఘుచిత్రంగా నిలిచింది. ‘జైలవకుశ’ సినిమాలోని ‘నీ కళ్ళలోని కాటుక’ అనే పాటకు చిన్న కథ జోడించి ఆయనే కొరియోగ్రాఫర్, రచన, దర్శకుడిగా చేసిన కవర్ సాంగ్ యూట్యూట్‌లో దాదాపు 70 లక్షల మంది వీక్షించారు. టిక్ టాక్ దుర్గారావు దంపతులు నిరంతరం ఏదో ఒక సినిమాల్లోని పాటలకు డ్యాన్సులు చేస్తున్నారు. అంధుడైన రాజు బస్సు ప్రయాణంలో పాడిన పాటకు సినీసంగత దర్శకులు తమన్ అవకాశం ఇస్తానని ప్రకటించారు.
ఆవన్నీ నాణేనికి ఒకపక్క. సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న మోసాలకు లెక్క లేదు. సామాజిక మాధ్యమాల్లో ప్రచారం పొందాలనే యావతో కొంతమంది ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ప్రమాదకర పరిస్థితుల్లో షూట్ చేస్తూ తమ జాగ్రత్త మరుస్తున్నారు. ఈవిధంగా ప్రమాదాల్లో ఇరుక్కున్నవారి వార్తలు తరచూ వస్తూనే ఉన్నాయి. ఇవే వేదికగా మోసగాళ్లు కూడా తయారై ఔత్సాహికులను వంచిస్తున్నారు.ఈ జాగ్రత్తలు పాటించటం సామాజిక మాధ్యమాల్లో తమ ప్రతిభను వీడియో తీసి పాపులర్ అయిన కవులు, కళాకారులు, గాయకులు, రచయితలు, ఆర్టిస్టులు, సినీరంగ ప్రముఖులు ఎందరో ఉన్నారు. వేగంగా పాపులర్ అవ్వటం, ఆ వెంటనే విమర్శల పాలవ్వటం వంటివి కూడా జరుగుతూ ఉంటాయి. డేటా చౌర్యం, విద్వేష పూరిత ప్రసంగాలు, మానసిక ఆరోగ్యంపై ప్రభావం, ఎన్నికల ఫలితాల తారుమారు, తప్పుడు సమాచార వ్యాప్తితో అవి చేస్తున్నాయనేది ఆరోపణలు కూడా ఉన్నాయి. గుర్తుతెలియని వ్యక్తులతో పరిచయాల కారణంగా అనేక సైబర్ మోసాలు జరుగుతున్నాయి. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేసే విధంగా చర్యలు తీసుకుంటే వార్తలు, షాపింగ్, బిజినెస్, ఎంటర్‌టైన్‌మెంట్ తదితర వ్యాపార రంగాలకు సామాజిక మాధ్యమాలు ఉపయోగకరంగా ఉంటాయని సైబర్ నిపుణులు చెబుతున్నారు.