శబరిమలలో మండల పూజోత్సవానికి సర్వం సిద్ధమైంది. గురువారం మధ్యాహ్నం నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరగనున్నందున వర్చువల్ బుకింగ్‌లో 50 వేల మంది.. స్పాట్ బుకింగ్‌లో 5 వేల మంది భక్తులకు మాత్రమే దర్శనానికి అవకాశం కల్పిస్తామని ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు(టీడీబీ) వెల్లడించింది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో మండల పూజోత్సవం ప్రారంభమవుతుందని, ఆ తర్వాత నెయ్యాభిషేకం జరిపి.. దర్శనానికి అనుమతిస్తామని, రాత్రి 11 గంటలకు ‘హరివరాసనం’తో ఆలయం తలుపులను మూసివేస్తామని తెలిపింది. మకర విళక్కు సీజన్ సందర్భంగా ఈ నెల 30న సాయంత్రం 5 గంటలకు అయ్యప్ప స్వామి సన్నిధానాన్ని తిరిగి తెరుస్తామని చెప్పారు. జనవరి 14న మకర విళక్కు పూజలు ఉంటాయని, 18వ తేదీ వరకు ఆలయం తెరిచి ఉంటుందని వివరించారు. కాగా.. ఆదివారం అరన్ముల పార్థసారథి ఆలయం నుంచి బయలుదేరిన ‘తంగ అంకి’(వస్త్రాలంకరణ) ఊరేగింపు బుధవారం మధ్యాహ్నం పంపాబేస్‌కు.. సాయంత్రం సన్నిధానానికి చేరుకుంది.