ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు గుంటూరు స్పెషల్ కోర్టు పెద్ద ఊరటను కలిగించింది. ఆయనపై గతంలో నమోదైన క్రిమినల్ కేసును కోర్టు ఎత్తివేసింది.వాలంటీర్లను ఉద్దేశించి గతంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ… వాలంటీర్లు అసాంఘిక శక్తులుగా మారారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది జులై 9న ఏలూరులో నిర్వహించిన వారాహి సభలో ఆయన ప్రసంగిస్తూ ఈమేరకు ఆరోపించారు. ఇంట్లో మగవాళ్లు లేని సమయంలో వెళ్తున్నారని, దండుపాళ్యం బ్యాచ్ మాదిరి తయారయ్యారని, వాలంటీర్ వ్యవస్థలో జవాబుదారీతనం లేదని ఆయన అన్నారు.
దీంతో కడప, గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన కొందరు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పవన్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను ఆదేశిస్తూ అదే నెల 20న అప్పటి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఆదేశాలిచ్చారు. నేరుగా ప్రభుత్వమే ఆదేశించడంతో గుంటూరు జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ గుంటూరు కోర్టులో ఫిర్యాదు చేశారు. పవన్ పై 499, 500 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదయింది. ఈ కేసుపై పవన్ కల్యాణ్ హైకోర్టును కూడా ఆశ్రయించారు. మరోవైపు, గుంటూరు కోర్టు తాజా విచారణలో… పవన్ పై తాము ఫిర్యాదు చేయలేదని వాలంటీర్లు తెలిపారు. ఆ సంతకాలు తమవి కాదని చెప్పారు. దీంతో కేసును ఎత్తివేస్తూ గుంటూరు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి శరత్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు.