..చంద్రబాబుకు ఊడిగం చేయాలన్నా… మోదీని బడే భాయ్ అనాలన్నా అది రేవంత్ రెడ్డికే సాధ్యం: హరీశ్ రావు
..చర్చకు ఆయన ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని వెల్లడి
..పాలమూరు ప్రగతిపై పచ్చి అబద్ధాలు మాట్లాడాడని ఆగ్రహం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే హరీశ్ రావు మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి 14 నెలల పాలనపై చర్చకు సిద్ధమని, రేవంత్ రెడ్డి చెప్పిన చోటుకు, చెప్పిన సమయానికి తాను వస్తానని పేర్కొన్నారు. కొడంగల్ అయినా.. రేవంత్ రెడ్డి ఇంట్లో అయినా చర్చకు సిద్ధమంటూ హరీశ్ ప్రతి సవాల్ విసిరారు.
తమపై నిందలు వేయడం మానుకొని నదీ జలాల్లో తెలంగాణ ప్రయోజనాలను కాపాడాలని రేవంత్ ప్రభుత్వానికి ఆయన సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి తనకు అలవాటైన పైశాచిక భాషలో పాలమూరు ప్రగతిపై అబద్ధాలు మాట్లాడారని హరీశ్ రావు విమర్శించారు. కృష్ణా జలాలను ఏపీ యథేచ్ఛగా తరలించుకుపోతుంటే ఆపడం చేతగాక తమపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. పాలమూరును ఎడారిగా మార్చిన తెలుగుదేశం, కాంగ్రెస్‌లతో అంటకాగుతూ రేవంత్ రెడ్డి తీవ్ర ద్రోహం చేశాడని విమర్శించారు.
14 నెలల్లో ఒక్క చెక్ డ్యామ్ కూడా కట్టని వారు కేసీఆర్ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని హరీశ్ అన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి, కాంగ్రెస్ పాలనలో వలసలకు ఆకలి చావులకు నిలయంగా మారిన పాలమూరు తలరాతను మార్చింది కేసీఆర్ అని పేర్కొన్నారు. గురువు చంద్రబాబుకు ఊడిగం చేసినా .. ప్రధాని మోదీకి భయపడి బడే భాయ్ అన్నా అది రేవంత్ రెడ్డి లాంటి ఊసరవెల్లికే సాధ్యమని హరీశ్ రావు ఘాటుగా విమర్శించారు.
రేవంత్ రెడ్డికి నీటి విలువ, నోటి విలువ తెలియదని, ఆయనకు తెలిసిందల్లా ఒక్క అవినీతి నోట్ల విలువేనని అన్నారు. బాధ్యత గల ముఖ్యమంత్రి పదవిలో ఉన్న విషయాన్ని గుర్తుంచుకుని రేవంత్ అడ్డగోలుగా మాట్లాడటం మానుకోవాలని హితవు పలికారు. అరుపులు, పెడబొబ్బలతో రాష్ట్ర సాగు, తాగు నీటి కష్టాలను రేవంత్ తీర్చలేడని, నిందలు వేయడం మాని నదీజలాల్లో తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలని హరీశ్ రావు సూచించారు.