గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అక్రమ నిర్మాణదారులను, భూకబ్జాదారులను హడలెత్తిస్తున్న హైడ్రా.. మరో కీలక చర్య చేపట్టింది. దాదాపు రూ.3 కోట్ల విలువైన పార్క్ స్థలాన్ని హైడ్రా పరిరక్షించింది. సంగారెడ్డి జిల్లా ముత్తంగిలోని గాయత్రి అసోసియేషన్ సభ్యులు తమ కాలనీ పార్క్ కబ్జాకు గురయిందని అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. దాదాపు ఏడు గుంటల భూమి కబ్జాకు గురైనట్లు గుర్తించారు. హైడ్రా సిబ్బంది శుక్రవారం అక్కడకు చేరుకుని సదరు పార్క్ స్థలం చుట్టూ ఉన్న ఫెన్సింగ్‌ను తొలగించి, షెడ్లను నేలమట్టం చేశారు. అన్యాక్రాంతం అయిన పార్క్ స్థలాన్ని హైడ్రా అధికారులు పరిరక్షించడంతో అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.