ఏపీలో గ్రామీణ రహదారుపై ప్రభుత్వం సంచలన నిర్ణయం తీఆసుకుంది. ఇప్పటికే రాష్ట్రంలో జాతీయ రహదారులు మినహాయిస్తే రాష్ట్ర రహదారులు, ముఖ్యంగా గ్రామీణ రహదారులు దారుణంగా ఉన్నాయి. వీటిపై గుంతల్ని పూడ్చేందుకు ఈ మధ్యే పాట్ హోల్ ఫ్రీ ఏపీ పేరుతో ప్రభుత్వం ఓ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం ప్రకటించారు. ఇకపై జాతీయ రహదారుల తరహాలో గ్రామీణ రహదారుల్ని కూడా అభివృద్ధి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్రంలో రహదారుల పరిస్ధితి దృష్ట్యా వీటి నిర్వహణను ఔట్ సోర్సింగ్ ఏజెన్సీకి అప్పగించాలని నిర్ణయించినట్లు సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు. అయితే తొలుత దీన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని నిర్ణయించారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ముందుగా ఈ ప్రయోగం చేయనున్నారు. విజయవంతమైతే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించబోతున్నారు. అలాగే వీటిపై టోల్ ఫీజు కూడా వసూలు చేయబోతున్నారు.