విశాఖపట్నంలో హోటల్ ఫోర్ పాయింట్స్ బై షెర్టాన్ లో సీఐఐ టూరిజం అండ్ ట్రావెల్ సమ్మిట్ జరిగింది. ఈ సమ్మిట్ లో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొని ప్రసంగించారు. పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పించడం శుభపరిణామని, అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా సదస్సులో కందుల దుర్గేష్ తెలిపారు. ఏప్రిల్ 2025 నుండి కొత్త పర్యాటక హిత పాలసీ అమల్లోకి రానుందన్నారు. పర్యాటకులను ఆకర్షించేలా, స్టేక్ హోల్డర్లకు అనుకూలంగా ఉండేలా పాలసీ రూపకల్పన చేస్తున్నామన్నారు.ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ సెప్టెంబర్ 27వ తేదీన విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన అంతర్జాతీయ పర్యాటక దినోత్సవంలో రాష్ట్ర పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారని తెలిపారు. ఇండస్ట్రీలకు ఇచ్చే బెనిఫిట్స్ అన్నీ టూరిజానికి కూడా కల్పిస్తామన్నారు. పర్యాటక అభివృద్ధి కోసం ప్రాజెక్ట్ లతో ముందుకు వస్తే ప్రభుత్వ పరంగా రాయితీలు కల్పిస్తామన్నారు. మొత్తం ఉపాధి కల్పనలో టూరిజం ద్వారా కనీసం 20 శాతం ఉద్యోగాలు కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి తెలిపారని మంత్రి వివరించారు. రాష్ట్ర పర్యాటకానికి సీఎం చంద్రబాబు నాయుడు ఎంతో ఊరట ఇచ్చే మాట చెప్పారని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. వివిధ వర్గాల నుంచి తీసుకున్న సమాచారంతో కార్యాచరణ ప్రారంభించామన్నారు.
కేరళ తరహాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటకం అభివృద్ధి చెందేందుకు అవసరమైన అన్ని వనరులున్నాయని అందులో భాగంగా 974 కి.మీల సుదీర్ఘ తీర ప్రాంతం, పదుల సంఖ్యలో బీచ్ లు, అపార సహజ వనరులు, నదులు, చరిత్ర, సంస్కృతి, ప్రాచీన ఆలయాలు, బౌద్ధారామాలు, వన్య ప్రాణి అభయారణ్యాలు, జాతీయ పార్క్ లు ఇలా ఎన్నో విధాలుగా పర్యాటకులను ఆకర్షించే ప్రాంతాలు ఉన్నాయని మంత్రి దుర్గేష్ తెలిపారు. పర్యాటకులను ఆకర్షించేలా టెంపుల్, ఎకో, అడ్వెంచర్, వెల్ నెస్, అగ్రి టూరిజంలను కలుపుతూ టూరిజం సర్క్యూట్ లు ఏర్పాటు చేస్తున్నామని తద్వారా సత్ఫలితాలు సాధిస్తామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల కృషితో కేంద్ర ప్రభుత్వం సై తం స్వదేశీ దర్శన్, ప్రసాద్ తదితర పథకాలతో రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని వృద్ధి చేయడానికి ముందుకు రావడం హర్షణీయమన్నారు. వందల కోట్ల కేంద్ర ప్రభుత్వ పర్యాటక పథకాల నిధులతో పర్యాటకాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఏపీ పర్యాటక రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక సహకారం ఉంటుందని దక్షిణాది రాష్ట్రాల పర్యాటక మంత్రుల సదస్సులో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వెల్లడించారని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. రాష్ట్ర పర్యాటక ప్రాజెక్టులపై సమగ్ర నివేదిక (డీపీఆర్) సిద్ధం చేశామని త్వరలోనే కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామన్నారు. రాష్ట్రంలో బీచ్ టూరిజం అభివృద్ధి చేసి జనవరిలో బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తామని మంత్రి వెల్లడించారు. సినిమాలు, లఘు చిత్రాల ద్వారా రాష్ట్ర పర్యాటక రంగానికి ప్రాచుర్యం కల్పిస్తామన్నారు. దేశంలో 3వ అతిపెద్ద సముద్రతీరం ఏపీలో ఉన్నప్పటికీ కేవలం రుషికొండ మాత్రమే బ్లూఫాగ్ బీచ్ గా ఎంపికైందని దానితో పాటు అందమైన కాకినాడ, సూర్యలంక, మైపాడు, రామాపురం బీచ్ లున్నాయని గుర్తుచేశారు.2025-30 కి సంబంధించి 5 ఏళ్లకు కొత్త టూరిజం పాలసీని రూపొందిస్తున్నామని తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక రంగానికి పునర్ వైభవం వస్తుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.