యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు దేశవిదేశాల్లో ఉన్న అభిమాన గణం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా జపాన్‌లో ఆయనకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఆయన సినిమాల కోసం జపనీయులు ఎంతగా ఎదురుచూస్తారో చాటిచెప్పే సంఘటనలు ఎన్నో జరిగాయి. తాజాగా అలాంటిదే మరో సంఘటన చోటుచేసుకుంది. ఎన్టీఆర్ నటించిన ‘వార్-2’ సినిమాను చూసేందుకు క్రిసో అనే ఓ యువతి ఏకంగా జపాన్ నుంచి భారత్‌కు వచ్చింది.ఇటీవల ఢిల్లీ విమానాశ్రయంలో క్రిసో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె ఎన్టీఆర్ ఫొటో ప్రింట్ చేసిన ప్రత్యేక టీ-షర్టు ధరించి కనిపించింది. ఈ సందర్భంగా కొందరు ఆమెను పలకరించగా, తాను జూనియర్ ఎన్టీఆర్‌కు వీరాభిమానినని, కేవలం ‘వార్-2′ సినిమా చూడటం కోసమే ఇక్కడికి వచ్చానని ఆమె చెప్పింది. ఎన్టీఆర్ సినిమా కోసం ఇలా ఇండియాకు రావడం ఇది మొదటిసారి కాదని, గతంలో కూడా ఆయన సినిమాల కోసం వచ్చానని క్రిసో తెలిపింది. మళ్లీ తారక్ సినిమా విడుదలైనప్పుడు తప్పకుండా వస్తానని ఆమె చెప్పింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది.ఆర్ఆర్ఆర్’, ‘దేవర’ వంటి సినిమాలతో జపాన్‌లో ఎన్టీఆర్‌కు భారీ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. గతంలో ‘దేవర’ సినిమా విడుదల సమయంలో ఓ అభిమాని ఏకంగా తెలుగు నేర్చుకుని మాట్లాడిన వీడియోను ఎన్టీఆర్ స్వయంగా పంచుకున్నారు. ఇప్పుడు ‘వార్-2’ కోసం మరో అభిమాని ఇలా దేశం దాటి రావడం ఆయనకున్న గ్లోబల్ స్టార్‌డమ్‌కు నిదర్శనమని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వచ్చిన ‘వార్-2’ సినిమాలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనను అందుకుంది.