టాలీవుడ్ సీనియర్ నటి, మాజీ ఎంపీ జయప్రద అన్నయ్య రాజ బాబు ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని నివాసంలో ఫిబ్రవరి 27న మధ్యాహ్నం రాజ బాబు తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని జయప్రద స్వయంగా ఇన్‌స్టా వేదికగా తెలిపారు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు, సినీ ప్రముఖులు జయప్రద కుటుంబానికి సానుభూతి తెలియజేశారు. రాజమండ్రిలోని పుష్కర్‌ఘాట్ వద్ద ఉన్న గోదావరి జలల్లో నేడు రాజబాబు అస్థికలను కలిపారు కుటుంబ సభ్యులు. రాజబాబు కొడుకు సామ్రాట్‌తో కలిసి రాజమండ్రికి వచ్చిన జయప్రద దగ్గరుండి రాజబాబు అస్థికల నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించింది.
అనంతరం జయప్రద మీడియాతో మాట్లాడుతూ.. రాజమండ్రి పుణ్యభూమిలో నా అన్నయ్య రాజబాబు అస్థికలు కలిపాము. రాజబాబు ఇక్కడే పుట్టాడు, ఇక్కడే పెరిగాడు. నేను రాజమండ్రికి ఎప్పుడొచ్చినా రాజబాబు తోడుగా వచ్చేవాడు. మొట్టమొదటి సారి అతడు లేకుండా రాజమండ్రి వచ్చాను. ఫిబ్రవరి 27న ఆయన మమ్మల్ని వదిలేసి వెళ్లిపోయాడు. మా జీవితాల నుంచి దూరంగా వెళ్లిపోయినందుకు మాకు చాలా దుఃఖంగా ఉంది. రాజబాబు కుమారుడైన సామ్రాట్‌ని తీసుకువచ్చి ఆయన ఎక్కడ పుట్టాడో అక్కడే అస్థికలు కలపడం జరిగింది. రాజబాబు చనిపోయి నేటికి ఏడవ రోజు. రాజమండ్రి ప్రజలు, ఈ గోదారమ్మ తల్లి, ఆ శివుడు మా తమ్ముడికి మోక్షం కలిగించాలని ప్రార్థిస్తున్నాను అంటూ జయప్రద చెప్పుకోచ్చింది.