మహిళా కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపుల కేసులో జైలుకు వెళ్లి, బెయిల్ పై బయటకు వచ్చిన జానీ మాస్టర్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయంపై ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు కొట్టేసింది. ఈ విషయాన్ని యాంకర్, ఫిల్మ్ ఇండస్ట్రీ లైంగిక వేధింపుల కమిటీ సభ్యురాలు ఝాన్సీ ఓ పోస్టులో వెల్లడించారు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఫిల్మ్ ఛాంబర్ ఆదేశాలను సవాలు చేస్తూ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెట్టుకున్న మధ్యంతర పిటిషన్ ను జిల్లా కోర్టు కొట్టేసిందని ఝాన్సీ తన పోస్టులో తెలిపారు. ఇది చాలా ముఖ్యమైన తీర్పని, పని చేసే ప్రదేశాల్లో మహిళల భద్రతకు ప్రాధాన్యత ఉందని కోర్టు మరోసారి రుజువు చేసింది. ఈ విషయంలో ధర్మం వైపు నిలబడి పోరాటం చేసిన తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలికి ధన్యవాదాలు అంటూ పోస్టు పెట్టారు. తనను డాన్సర్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి తప్పించాలన్న ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయంపై జానీ మాస్టర్ మండిపడ్డారు. తనపై దాఖలైన కేసులో విచారణ జరుగుతోందని, ఇంకా తీర్పు వెలువడలేదని గుర్తుచేశారు. తాను నేరం చేశానని ఇంకా రుజువు కాకుండానే చర్యలు తీసుకోవడాన్ని సవాల్ చేస్తూ జానీ మాస్టర్ కోర్టుకెక్కారు. జానీ మాస్టర్ దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు తాజాగా కొట్టివేసిందని ఝాన్సీ తన పోస్టులో వెల్లడించారు.